Nora Fatehi: ఆ ఐటెమ్ సాంగ్ కోసం మరీ పొట్టి డ్రెస్.. చేయలేనన్న హీరోయిన్.. చివరికి ఏం జరిగిందంటే?
Nora Fatehi: ఓ ఐటెమ్ కోసం వేసుకునే డ్రెస్సు మరీ పొట్టిగా ఉందంటూ ఆ హీరోయిన్ షూటింగ్ చేయడానికి నిరాకరించడం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి మట్కా మూవీలో కనిపించబోతున్న బాలీవుడ్ నటి నోరా ఫతేహి తనకు ఎదురైన అలాంటి అనుభవం గురించి వెల్లడించింది.
Nora Fatehi: ఐటెమ్స్ సాంగ్స్ కు సినిమాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అది ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సాంగ్స్ లో నటించే వాళ్లు కూడా తొందరగా పాపులర్ అవుతారు. అలా బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా దిల్‌బర్ అనే ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. అయితే ఈ పాట కోసం తాను వేసుకోవాల్సిన డ్రెస్ మరీ పొట్టిగా ఉండటంతో మొదట తాను చేయనని చెప్పినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
నోరా ఫతేహి దిల్‌బర్ సాంగ్
కెనడియన్ యాక్టర్, డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి తన అందం, డ్యాన్స్ మూవ్స్ తో అభిమానులను అలరిస్తోంది. ఆమె కొన్నాళ్ల కిందట దిల్‌బర్ అనే పాటలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్ గురించి ఈ మధ్యే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ముఖ్యంగా ఈ పాటలో తన కాస్ట్యూమ్ పై తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. "నేను ఆ ఫిల్మ్ మేకర్స్ తో మాట్లాడినప్పుడు మొదట ఒకే విషయం చెప్పాను. దీనిని ఓ ఐటెమ్ సాంగ్ లా మార్చేసి హాట్ అండ్ సెక్సీగా కనిపించేలా చేయొచ్చు. లేదంటే మనం కాస్త మార్చి ఎక్కువగా డ్యాన్స్ ఆధారంగా సాగే పాటగా మార్చొచ్చు.
అలాంటి పాటను ఎవరైనా తమ కుటుంబాలతో కలిసి చూసేలా చేయొచ్చు. అసలు ఈ డ్యాన్స్ ఏంటి? ఈ హుక్ స్టెప్ బాగుంది.. ట్రై చేద్దాం అని వాళ్లకు అనిపించాలి. అలాంటి పాటలు చాలా రోజుల వరకు గుర్తుంటాయని చెప్పాను. కొరియోగ్రఫీ చాలా ఎక్కువగా ఉండేలా చూసుకున్నాను. ఆ సమయంలో వాళ్ల నాకు ఓ బ్లౌజ్ ఇచ్చారు. అది మరీ చిన్నగా ఉంది.
అది చూసి నన్ను మరీ ఎక్కువ సెక్సువలైజ్ చేయొద్దని చెప్పాను. ఇది సెక్సీ సాంగే అయినా.. మరీ అసభ్యకరంగా ఉండొద్దన్నాను. మరుసటి రోజు ఉదయం వాళ్లు మరో బ్లౌజ్ రెడీ చేశారు. దానితోనే నేను పాట పూర్తి చేశాను. అది కూడా చాలా మందికి చిన్నగానే అనిపించొచ్చు. కానీ ముందు ఇచ్చినదాని కంటే ఇది చాలా మెరుగ్గానే ఉంది" అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఈ మధ్యే వచ్చిన మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ మూవీలో కనిపించింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ ఆమె అడుగుపెట్టనుంది. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మట్కా మూవీలో నోరా నటిస్తోంది.