Sandeep Reddy Vanga: వారు ఆ విషయాలు మాట్లాడలేదు.. నిరక్షరాస్యులు!: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఘాటు వ్యాఖ్యలు: వీడియో
Sandeep Reddy Vanga: కొందరు సినీ విమర్శకులపై యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. సినిమాల పరంగా వారు నిరక్షరాస్యులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలివే..
Sandeep Reddy Vanga: యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత భారీ బ్లాక్‍బాస్టర్ అయిందో.. అంతే పెద్ద చర్చలకు కూడా దారి తీసింది. యానిమల్ సినిమా సమాజానికి చేటు చేసేలా ఉందని, ఇదో వ్యర్థమైన మూవీ అంటూ కొందరు విమర్శకులు (క్రిటిక్స్).. ఘాటుగా రివ్యూలు ఇచ్చారు. హింస, విచ్చలవిడి తనం హద్దులు దాటిందని అభిప్రాయపడ్డారు. అయితే, యానిమల్ చిత్రం మాత్రం భారీ హిట్ అయింది. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాగా 20 రోజుల్లోపే ఈ చిత్రానికి రూ.830కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. అయితే, తన చిత్రానికి కొందరు క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూలపై యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ఓ ముగ్గురు విమర్శకుల పేర్లను సందీప్ రెడ్డి వంగా ప్రస్తావించారు. వారెవరూ ఎడిటింగ్, సౌండ్ డిజైన్, టేకింగ్ లాంటి క్రాఫ్ట్ గురించి చెప్పలేదని, సినిమాల విషయానికి వస్తే వారు నిరక్షరాస్యులంటూ ఫైర్ అయ్యారు సందీప్.
“వారి రివ్యూల వల్ల మా సినిమాకు ఫస్ట్ డే ఓపెనింగ్ వచ్చిందా. క్రాఫ్ట్ వల్ల వచ్చింది. వారెవరూ క్రాఫ్ట్ గురించి మాట్లాడలేదు. సౌండ్ డిజైన్, ఎడిటింగ్ గురించి చెప్పలేదు. ఎందుకంటే వారు సినిమాల విషయానికి వస్తే అన్‍ఎడ్యుకేటెడ్, నిరక్షరాస్యులు. వాళ్లకు సినిమాను విశ్లేషించేంత జ్ఞానం లేదు. వాళ్లు కేవలం సున్నితమైన అంశాలను చూసి.. దాని గురించే మాట్లాడతారు. ఒకవేళ ముఖాముఖి మాట్లాడదామంటే కూడా వారికి ధైర్యం లేదు” అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు.
తాను ముంబైకి వచ్చి ఐదేళ్లయిందని, ఇక్కడ ఓ గ్యాంగ్ (క్రిటిక్స్) ఉందని తాను అర్థం చేసుకున్నానని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. “ఆ గ్యాంగ్‍కు ఒకరమైన సినిమాలే నచ్చుతాయి. వారు కొందరి సినిమాలనే ప్రశంసిస్తారు. ఇతరుల చిత్రాలను చీల్చిచెండాడుతారు” అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. తన మూడు చిత్రాలకు వచ్చిన ఒక్క రివ్యూను కూడా తాను ట్వీట్ చేయలేదని ఆయన చెప్పారు. రామ్‍గోపాల్ వర్మ రాసిన రివ్యూకు మాత్రమే స్పందించానని, ఎందుకంటే ఆయనకు తాను పెద్ద అభిమానని అన్నారు.
యానిమల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించారు. రష్మిక మందన్న హీరోయిన్‍గా చేశారు. బాబీ డియోల్, తృప్తి డిమ్రి, అనిల్ కపూర్, శక్తి కపూర్ కీలకపాత్రలు పోషించారు. తండ్రిని రక్షించుకునేందుకు ఏం చేసేందుకైనా.. ఎవరిని చంపేందుకైనా వెనుకాడని కొడుకు పాత్రను ఈ చిత్రంలో రణ్‍బీర్ పోషించారు.