Nitish Kumar Celebrations: హాఫ్ సెంచరీకి పుష్ప.. శతకానికి బాహుబలి.. నితీశ్ సెలెబ్రేషన్స్ వైరల్.. సలార్‌కు కూడా సింక్
Nitish Kumar Celebrations: తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత శతకం చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శతకం బాది దుమ్మురేపాడు. మైల్‍స్టోన్ చేసిన సమయంలో అతడి సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి.. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే శతకం చేశాడు. తన తొలి అంతర్జాతీయ సిరీస్‍లోనే.. అదీ అస్ట్రేలియా గడ్డపై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సత్తాచాటి సెంచరీ పూర్తి చేశాడు. మెల్‍బోర్న్ స్టేడియంలో నితీశ్ హోరెత్తించాడు. ఆసీస్‍పై నాలుగో టెస్టు మూడో రోజైన నేడు (డిసెంబర్ 28) శతకం చేశాడు భారత యంగ్ స్టార్ నితీశ్. బ్యాటింగ్ ఆర్డర్ ఎనిమిదో స్థానంలో వచ్చిన అద్భుతం బ్యాటింగ్‍తో అదరగొట్టాడు. టీమిండియాను ఫాలోఆన్ ప్రమాదం నుంచి నితీశ్ తప్పించాడు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డి.. అర్ధ సెంచరీ, శతకం పూర్తి చేసిన సమయంలో చేసుకున్న సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శతకం.. బాహుబలి స్టైల్‍లో..
నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీకి చేరిన సమయంలో బాహుబలి స్టైల్‍లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‍ను నిలబెట్టి.. హ్యాండిల్‍పై హెల్మెట్ పెట్టాడు నితీశ్. తాను ఒక మోకాలిపై కూర్చొని చేతిని పైకి పెట్టి ఆకాశం వైపునకు చూశాడు. బాహుబలి 2 చిత్రంలో కట్టప్ప వెన్నుపోటు పొడిచిన సమయంలో బాహుబలిగా నటించిన ప్రభాస్.. కత్తిని మణికట్టు కింద పెట్టుకొని సింహాసనంపై కూర్చున్నట్టుగా చేస్తాడు. రాజసం కనబరుస్తాడు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా దాదాపు అదే స్టైల్‍లో బ్యాట్‍ను పట్టుకొని సెలెబ్రేట్ చేస్తున్నాడు.
సలార్ పోజ్‍తో సింక్
నితీశ్ కుమార్ సెలెబ్రేషన్లకు సలార్ కూడా సింక్ అవుతుంది. క్లైమాక్స్ ఫైట్‍లో ప్రభాస్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తర్వాత కత్తి పట్టుకొని ఓ మోకాలిపై కూర్చుంటాడు. ఒళ్లంతా రక్తంలో తడిచిపోయి ఉంటుంది. ఇదొక ఐకానిక్ పోజ్‍గా ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పోజ్ దీనికి కూడా సింక్ అవుతోంది. మొత్తంగా నితీశ్ కుమార్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఇది బాహుబలి సెలెబ్రేషన్స్ అంటుంటే.. కొందరు సలార్‌కు లింక్ చేస్తున్నారు.
హాఫ్ సెంచరీకి పుష్ప సిగ్నేచర్
నితీశ్ కుమార్ రెడ్డి ఇదే మ్యాచ్‍లో తొలిసారి టెస్టు హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు. ఈ సందర్భంగా పుష్ప సినిమా స్టైల్‍లో ‘తగ్గేదేలే’ సిగ్నేచర్ గెస్చర్‌ను బ్యాట్‍తో చేశాడు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మూవ్ గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయింది. దీన్ని నితీశ్ ఫాలో అయ్యాడు. తగ్గేదేలే అంటూ బ్యాట్‍తో చేసి ఆటలో తాను తగ్గనని మేసేజ్ ఇచ్చేశాడు. అదే జోరు చూపి సెంచరీ పూర్తి చేశాడు. ఇంకా అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని సత్తాచాటాడు.
నితీశ్ కుమార్ రెడ్డి 171 బంతుల్లో శతకం చేశాడు. ప్రస్తుతం 176 బంతుల్లో 105 పరుగుల వద్ద అజేయంగా ఉన్నాడు. నాలుగో టెస్టు మూడో రోజు ముగిసే సరికి భారత్ 9 వికెట్లకు 358 పరుగుల వద్ద ఉంది. నితీశ్ (105 నాటౌట్), సిరాజ్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ఆట కొనసాగించనున్నారు. వాషింగ్టన్ సుందర్ (50) అద్భుత అర్ధ శతకం చేశాడు. నితీశ్, సుందర్ ఎనిమిదో వికెట్‍కు 127 పరుగులు జోడించి భారత్‍ను ఆదుకున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 116 పరుగుల దూరంలో ఉంది.
టాపిక్