నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీ శుక్రవారం (జూలై 4న) థియేటర్లలో రిలీజైంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీకి వకీల్‌సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో లయ కీలక పాత్ర పోషించింది. తమ్ముడు ఎలా ఉంది? నితిన్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా? లేదా? అంటే?
జై (నితిన్) ఆర్చరీ ప్లేయర్. వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలన్నది అతడి కల. అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ (లయ) విషయంలో చిన్నతనంలో చేసిన ఓ తప్పు కారణంగా ఆటపై ఫోకస్ పెట్టలేకపోతాడు. తనకు దూరమైన అక్కను కలిసి ఆమెకు సారీ చెప్పి తన పొరపాటును సరిదిద్దుకోవాలని అనుకుంటాడు. ఝాన్సీ ఓ స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫీసర్. వైజాగ్‌లోని ఫ్యాక్టరీ ప్రమాదం విషయంలో యజమాని అజర్వాల్‌కు వ్యతిరేకంగా నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్‌ను మార్చమని ఝాన్సీని బెదరిస్తాడు అజర్వాల్.
అందుకు ఝాన్సీ ఒప్పుకోదు. తన కుటుంబంతో కలిసి అంబరగొడుగు అనే ప్రాంతంలో జరిగే జాతరకు ఝాన్సీ వెళుతుంది. తన సోదరిని వెతుక్కుంటూ జై కూడా ఆ జాతరకు వస్తాడు. అజర్వాల్ కారణంగా తన అక్క ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి జై ఏం చేశాడు? అజర్వాల్ బారి నుంచి ఝాన్సీని ఎలా కాపాడుకున్నాడు? ఈ పోరాటంలో జైకి అండగా నిలిచి రత్న (సప్తమి గౌడ), గుత్తి (స్వసిక), చిత్ర (వర్ష బొల్లమ్మ) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
తమ్ముడు టైటిల్‌తోనే ఈ సినిమా జోనర్ ఏమిటన్నది మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి యాక్షన్,అడ్వెంచర్ ఎలిమెంట్స్ జోడించి మల్టీజానర్ మూవీగా తమ్ముడు రూపొందింది. ఎమ్‌సీఏ సీక్వెల్ లాంటి మూవీ ఇదని ప్రమోషన్స్‌లో నిర్మాత దిల్‌రాజు అన్నారు. కానీ ఆయన చెప్పిన మాటలకు సినిమా కథకు ఎక్కడ పొంతన కనిపించదు. ఎమ్‌సీఏలో వర్కవుట్ అయిన సెంటిమెంట్ మాత్రం తమ్ముడులో గాడితప్పింది. కథ రొటీన్గా ఆర్టీఫీషియల్‌గా సాగడంతో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ లేకుండాపోయింది.
అజరాత్వ్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అర్చరీ ప్లేయర్‌గా జై క్యారెక్టర్ ఎంట్రీ...స్నేహలతతో అతడికి ఉన్న అనుబంధం, అక్క విషయంలో చేసిన తప్పును తల్చుకుంటూ సంఘర్షణకు లోనవ్వడం లాంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. అక్కను వెతుక్కుంటూ జై సాగించే జర్నీతోనే అసలు సినిమా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్లను బిల్డ్ చేయడానికే టైమ్ మొత్తం తీసుకున్నారు దర్శకుడు.
సెకండాఫ్ మొత్తం అంబరగొడుగు అనే ప్రాంతం చుట్టూ సాగుతుంది. జాతరకు వచ్చిన ఝాన్సీని అజర్వాల్ మనుషుల బారి నుంచి జై ఎలా కాపాడాడు అన్నది చూపించారు. ఈ ఎపిసోడ్‌లో ఎమోషన్స్ వర్కవుట్ కాకపోయినా యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం బాగున్నాయి. అయితే ఆ ట్రాక్ మొత్తం నాచురాలిటీకి దూరంగా సాగిపోతుంది.
జై పాత్రలో నితిన్ ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్‌లలో మెప్పించాడు. హీరోయిన్లను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా చూపించారు. సప్తమి గౌడ క్యారెక్టర్ రన్ టైమ్ తక్కువే అయినా తన లుక్, యాక్టింగ్‌తో రత్న పాత్రకు న్యాయం చేసింది. హీరో సోదరి పాత్రలో లయ ఒదిగిపోయింది. సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌ను కనబరిచింది. వర్ష బొల్మల్మ, స్వాసిక నటన ఒకే.
అజనీష్ బీజీఎమ్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అంగరగొడగు ఎపిసోడ్స్‌లో విజువల్స్ ఆకట్టుకుంటాయి. దిల్‌రాజు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. తమ్ముడు యాక్షన్ వరకు ఓకే కానీ ఎమోషన్స్‌లో మాత్రం తడబడిపోయాడు.
రేటింగ్: 2/5