Robinhood Teaser: నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్ రిలీజ్.. చివర్లో నవ్వులు పూయించిన లాజిక్
Nithiin Robinhood teaser: నాలుగేళ్లుగా హిట్ లేని నితిన్.. తనకి చివరిగా హిట్ ఇచ్చిన దర్శకుడితోనే రాబిన్‌హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గురువారం రిలీజైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
నాలుగేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్.. రాబిన్ హుడ్‌తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భీష్మ రూపంలో తన కెరీర్‌లో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చి వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేసిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు ఈరోజు టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఖరీదైన ఇళ్లల్లో చోరీలు చేసే దొంగగా నితిన్‌ను టీజర్‌లో పరిచయం చేసిన చిత్ర యూనిట్.. రాబిన్ హుడ్‌కి పర్టిక్యులర్‌గా జెండా, ఎజెండాలు ఏమీ లేవని.. డబ్బు కోసం ఎవరికైనా ఎదురు వెళ్తాడు అంటూ రూడ్ క్యారెక్టర్ అని చెప్పకనే చెప్పింది. శ్రీలీలతో ప్రేమలో పడటం.. ఆమె వెనుక ఉన్న గ్యాంగ్ దగ్గర డబ్బుని కొట్టేయడం.. ఆ తర్వాత అతడ్ని వెతుక్కుంటూ గ్యాంగ్ భారత్‌కి రావడం కథగా కనిపిస్తోంది.
నాలుగేళ్లుగా నిరీక్షణ
2020లో భీష్మ తర్వాత నితిన్‌కి కెరీర్ గాడి తప్పింది. అతను చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూ వస్తున్నాయి. 2021లో మాస్ట్రో, రంగ్ దే, చెక్ సినిమాలు ఆశించిన మేర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత 2022లో వచ్చిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్‌గా మిగిలింది. 2023లో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (ఎక్స్‌ట్రాక్ట్) తేలిపోయింది. దాంతో ఈ రాబిన్ హుడ్ సినిమాపై నితిన్ గంపెడాశలు పెట్టుకున్నాడు.
నితిన్‌కి మాత్రమే కాదు.. ఈ సినిమాలో నటించిన శ్రీలీలకి కూడా ఈ సినిమా చాలా కీలకం. ఆమె చివరిగా నటించిన ఐదు సినిమాల్లో 3 డిజాస్టర్‌గా మిగిలాయి. ఒక యావరేజ్. దాంతో ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఈ అమ్మడి సినిమా ఒక్కటీ రాలేదు. ఈ రాబిన్ హుడ్ హిట్ అయితేనే శ్రీలీల కెరీర్ మళ్లీ గాడినపడుతుంది. నితిన్‌తో గత ఏడాది వచ్చిన ఎక్స్‌ట్రాక్ట్ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న రాబిన్‌హుడ్‌కి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.