NNS May 10th Episode: స్పృహలోకి వచ్చిన సరస్వతి మేడమ్.. వణికిపోయిన మనోహరి.. ఫోలో అయిన బీహారి గ్యాంగ్.. ఏడ్చేసిన యముడు
Nindu Noorella Saavasam May 10th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 10వ తేది ఎపిసోడ్‌లో సరస్వతి స్పృహలోకి వచ్చిందని అమర్‌కు తెలుస్తుంది. దాంతో మనోహరి వణికిపోతుంది. మరోవైపు మనోహరిని చూసిన బీహారి గ్యాంగ్ ఆమెను ఫాలో అవుతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 10th May Episode) అమర్ ఒక్కసారిగా ఆందోళనకు గురవడంతో అందరూ కంగారుపడతారు. మేడమ్‌ని తమ స్వార్థానికి బలిచేసిన వారిని తప్పకుండా కనిపెడతాను అంటుంది భాగీ. ఎలా కనిపెడతావమ్మా? అంటాడు రామ్మూర్తి.
నిజం బయటపడేలా
మా అమ్మగారిని చంపిందెవరో సరస్వతి మేడమ్ గారికి తెలుసనుకుంటున్నాం. ఆమె కోమాలో ఉన్నారు. ఆమె స్పృహలోకి రాగానే చెబుతుందని అనుకుంటున్నాం అంటాడు రాథోడ్. సరస్వతి పేరు వినగానే తాను కూడా అనాథ ఆశ్రమం వార్డెన్ సరస్వతి మేడమ్ కోసం వెతుకుతున్నానంటాడు రామ్మూర్తి. అలాగే వదిలేస్తే అరుంధతి ఈయన కూతురు అనే విషయం బయటపడేలా ఉందని కంగారు పడుతుంది మనోహరి.
దాంతో రాథోడ్ మీద అరుస్తుంది మనోహరి. అమర్‌ని అలాగే వదిలేసి రోడ్ మీద మీ మీటింగ్ ఏంటి అంటూ చిరాకుపడుతుంది. మెల్లిగా అమర్ దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతుంది. నా ఆరుని చంపేశారని తెలుసు, వాళ్లు నా చుట్టూనే ఉన్నారని తెలుసు. కానీ కనిపెట్టలేకపోతున్నా అంటాడు అమర్.
సరస్వతికి స్పృహ వచ్చిందని
మరోవైపు హాస్పిటల్లో ఉన్న సరస్వతి మేడమ్ స్పృహలోకి వస్తుంది. వెంటనే డాక్టర్ని పిలిచి చెబుతుంది నర్స్. అర్జంట్‌గా మాట్లాడాలి అంటుంది సరస్వతి మేడమ్. వెంటనే వాళ్ల వాళ్లకి ఫోన్ చేసి ఇవ్వు అంటుంది డాక్టర్. సరేనని అమర్‌కి ఫోన్ చేస్తుంది నర్స్. అమర్ ఫోన్ తీసి సరస్వతి మేడమ్‌కి స్పృహ వచ్చిందని తెలిసి మాట్లాడాలంటాడు.
మాటలు తడబడుతున్నా ఆమె తనతో ఏదో మాట్లాడాలనుకుంటుందని అర్థం చేసుకుంటాడు అమర్. కానీ, అప్పుడే ఎనస్తీషియా ఇవ్వడంతో మరోసారి స్పృహ కోల్పోతుంది సరస్వతి మేడమ్. వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరతానంటాడు అమర్. కానీ, మనోహరి ఆపేసి నువ్వు ఆమెని కంగారు పెడితే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఆమెకి తెలిసిన విషయం నీకు చెప్పాలంటే ప్రాణాలతో ఉండాలి కదా అంటూ నాటకం ఆడుతుంది.
మనోహరిని చూసిన బీహారి గ్యాంగ్
రాథోడ్, భాగీకి మనోహరిపై అనుమానం వస్తుంది. మనోహరి మాటవిని హాస్పిటల్‌కి వెళ్లకుండా రామ్మూర్తి ఇంటికి వెళతాడు అమర్. దారిలో చెక్‌పోస్ట్ దగ్గర మనోహరిని చూసిన ఓ వ్యక్తి బీహారి గ్యాంగ్‌కి ఫోన్ చేసి వివరాలు చెబుతాడు. ఆమె ఉన్న కారు సూర్యాపేట వెళ్తుందని చెప్పగానే వాళ్లు కూడా మనోహరిని వెంబడిస్తూ ఆ దారిలోనే వెళతారు.
అసలేం జరుగుతోంది.. అన్ని ప్రమాదాలు ఒకేసారి వచ్చి చేరుతున్నాయి. నా గతం నన్ను వెంబడిస్తోంది. సరస్వతి మేడమ్ స్పృహలోకి వచ్చింది. నిజం తెలియకముందే అమర్‌తో నా పెళ్లి జరిగిపోవాలి అనుకుంటుంది మనోహరి. మరోవైపు చిత్రగుప్తుడిని పిలిపిస్తాడు యముడు. అరుంధతికి లోపలికి ప్రవేశం లేదనడంతో అక్కడే ఆగిపోతుంది.
ఏడ్చిన యముడు
గుప్త వదిలేసి వెళ్లిన మాయాదర్పణం తెరిచి చూసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, దాంట్లో ఎలా చూడాలో అర్థంకాక ఆలోచిస్తూ కూర్చుంటుంది. యముడి దర్శనానికి వెళ్లిన చిత్రగుప్తుడు.. యముడు ఏడవడం చూసి కంగారు పడతాడు. ఏమైంది ప్రభు అని అడుగుతాడు. ఆ బాలిక కష్టం చూసి మనసు చలించినది.
పుట్టినప్పటి నుంచి కష్టాలు అనుభవించిన ఆ బాలిక అందమైన జీవితాన్ని నిర్మించుకున్నప్పటికీ వేరొకరి స్వార్థానికి బలై అర్ధాంతరంగా తనువు చాలించవలిసి వచ్చిందని బాధపడతాడు యముడు. చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబ బాగుకోసం తన శక్తినంతా దారపోసిందని అంటాడు. స్నేహితురాలని నమ్మిన ఆ మనోహరి వల్లే తన చావు సంభవించినదని ఎప్పటికీ ఆమెకి తెలియదు కదా అని అడుగుతాడు చిత్రగుప్తుడు.