NNS July 26th Episode: మనోహరిని మందలించిన అమర్.. అంజుకు మిస్సమ్మ హెల్ప్.. మనోహరి గదిలో రణ్‌వీర్.. భర్తను చూసి షాక్
Nindu Noorella Saavasam July 26th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూలై 26వ తేది ఎపిసోడ్‌లో అమర్ గదిలో అరుంధతి డైరీ చివరి పేజీని మనోహరి చింపేయబోతుంటే.. అమర్ వచ్చి మందలిస్తాడు. తన గదిలోకి ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 26th July Episode) అరుంధతి డైరీని భాగీ చదువుతందనగా నిర్మల పిలవడంతో కిందకి వెళ్తుంది. అప్పుడే అటుగా వచ్చిన మనోహరి ఆ డైరీ చూసి ఒసేయ్ అరుంధతి.. చచ్చి కూడా నన్ను సాధిస్తున్నావు కదే.. నన్ను పట్టించడానికి బానే ప్లాన్ చేసావు. ఈ డైరీ ఎవరి కంట పడకుండా నేను చేస్తా కదా అంటూ చివరి పేజీ చింపేయబోతుంది.

ఇద్దరిదీ ఒకటే అయినప్పుడు
కిటికీలో నుంచి చూస్తున్న అరుంధతి వద్దు వద్దు.. అంటూ భయపడుతుంది. అప్పుడే అమర్ వచ్చి తన రూమ్‌లో ఏం చేస్తున్నావని మనోహరిని అడుగుతాడు. అమర్ మాట వినగానే కంగారు పడిన మనోహరి తన చార్జర్ పనిచేయకపోతే నీ చార్జర్ తీసుకోడానికి వచ్చాను అంటుంది. రాథోడ్‌కి చెబితే కొత్తది తెచ్చి ఇస్తాడు కదా అంటాడు అమర్. ఇద్దరిదీ ఒకే చార్జర్ అయినప్పుడు కొత్తది ఎందుకు అమర్ అంటుంది మనోహరి.
నా వస్తువులు ఆరుతో తప్ప ఎవరితోనూ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నీకు అర్థమైందనుకుంటా అంటాడు అమర్. సరే అమర్ అంటూ మెల్లిగా అక్కడ నుంచి వెళ్లబోతుంది మనోహరి. డైరీ ఇచ్చి వెళ్లమంటాడు అమర్. సారీ అమర్.. మర్చిపోయా అని డైరీ చేతిలో పెట్టి బయటకు వెళ్లబోతూ.. అమర్.. ఆరు అస్థికలు ఎక్కడ ఉన్నాయ్. వాటిని త్వరగా నదుల్లో కలపడం మంచిది అంటుంది మనోహరి.
త్వరగా పైకి పంపిద్దామని
ఏంటి మనోహరి ఎప్పుడూ లేనిది రెండు రోజుల నుంచి పదేపదే ఆరు అస్థికల గురించి అడుగుతున్నావు అంటాడు అమర్. అప్పుడే పైకి వచ్చిన భాగీ మనోహరి ఏదో చేయబోతుంది అని అనుమానపడుతుంది. అది కాదు అమర్.. ఎంతైనా ఆరు నా స్నేహితురాలు కదా.. అస్థికలు నదిలో కలిపితేనే తన ఆత్మ శాంతిస్తుందంట. తనని త్వరగా పైకి పంపిద్దామని అంతే అంటుంది మనోహరి.
సరే వీలైనంత తొందరగా కలిపేందుకు ప్రయత్నిస్తాను అంటాడు అమర్. ఇంతకీ.. ఆ అస్థికలు ఏ నంబర్ లాకర్‌లో ఉన్నాయని ఆరా తీస్తుంది మనోహరి. అమర్ నెంబర్ చెప్పగానే సంబరపడిపోతున్న మనోహరిని చూసి.. ఏవండీ.. అక్క అస్థికలను ఇక్కడ కాకుండా కాశీకి వెళ్లి గంగానదిలో కలుపుదామంటుంది మిస్సమ్మ. అరుంధతి కోరిక అదే అయితే తప్పకుండా అలాగే చేద్దామంటాడు అమర్.
టైమ్ బాగోలేకపోతే
ఆ అస్థికల్ని నేను కొట్టేస్తే మీరెలా కలుపుతారే అనుకుంటూ అక్కడనుంచి వెళ్తుంది మనోహరి. పిల్లలందరూ లేచి స్కూల్‌కి రెడీ అవుతారు. అంజు మాత్రం లేవకుండా ముసుగుతన్ని పడుకుంటుంది. పేరెంట్స్‌ని తీసుకురమ్మంటే స్కూల్ మానేసి ఇంట్లో ఉండటానికి ప్లాన్ చేస్తోందని అందరూ అంజుని ఏడిపిస్తారు. టైమ్ బాలేకపోతే అరటిపండు తిన్నా పళ్లు విరిగిపోతాయని అమ్మ చెబితే ఏమో అనుకున్నాగానీ కొంచెం నా టైమ్ బ్యాడ్ అవగానే సాధిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంటుంది అంజు.
సరేగానీ త్వరగా లేచి స్కూల్‌కి రెడీ అవ్వు అంటుంది అమ్ము. ఏదైనా ఐడియా ఉండే చెప్పు అమ్ము అంటుంది అంజు. నువ్వు సరే అంటే నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. వెళ్లి మిస్సమ్మ హెల్ప్ అడుగు తప్పకుండా పనైపోతుంది అని సలహా ఇస్తుంది అమ్ము. అంజు వెళ్లి మిస్సమ్మను తనకు సాయం చేయమని అడగడానికి ప్రయత్నించి విఫలం అవుతుంది. అమ్ము నచ్చజెప్పినా వినకుండా డాడీతోనే మాట్లాడుతా అంటుంది అంజు.
పక్కకి దాక్కున్న రణ్‌వీర్
మనోహరిని కలవడానికి అమర్ ఇంటికి వెళ్తాడు రణ్‌వీర్. సౌరభ్ వద్దని వారిస్తున్నా జాగ్రత్తగానే ఉంటానని చెప్పి మెకానిక్ వేషంలో ఇంట్లోకి వెళ్తాడు. రాథోడ్ జీప్ రిపేర్ చేస్తుంటే అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎదురుగా అమర్‌ని చూసి భయంతో పక్కకి దాక్కుంటాడు రణ్‌వీర్. ఇంతలో అంజు అమర్‌తో మాట్లాడ్డానికి వస్తుంది. సార్ మూడ్ బాలేదు ఇప్పుడు వెళ్లకు అని అంజుని ఆపుతాడు రాథోడ్. చెప్పినా వినకుండా అమర్ దగ్గరకు వెళ్లబోతుంది అంజు.
అప్పుడే అమర్ ఫోన్లో గట్టిగా అరవడంతో పిల్లలందరూ అక్కడనుంచి పారిపోతారు. అంజు భయంతో జీప్ మీద ఎక్కి కూర్చుంటుంది. తన ప్రాబ్లమ్ చెప్పి రాథోడ్‌ని ఏదైనా ఐడియా ఇవ్వమంటుంది. డాడీతో పనవదు గానీ మిస్సమ్మని వెళ్లి హెల్ప్ అడుగు అంటాడు రాథోడ్. నేను అడగను కానీ నాకోసం నువ్వు అడుగు అని అక్కడనుంచి పరిగెడుతుంది అంజు. రాథోడ్‌ని త్వరగా పని పూర్తిచేయమని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు అమర్.
మనోహరి గదిలోకి రణ్‌వీర్
రణ్‌వీర్ ప్లంబర్‌గా అమర్ ఇంట్లోకి అడుగుపెడతాడు. రణ్‌వీర్‌ని చూసి షాకవుతుంది అరుంధతి. మనోహరి భర్త ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటూ.. ఏవండీ.. మనోని తీసుకెళ్లడానికే వచ్చారా? మనో ఆ రూమ్‌లో ఉంది వెళ్లి తీసుకెళ్లండి అంటుంది. భయం భయంగా ఇంట్లోకి వచ్చిన రణ్‌వీర్ ఎటువెళ్లాలో తెలియక హాల్లోనే నిల్చుంటాడు. అప్పుడే అటుగా వచ్చిన మిస్సమ్మ ఎవరండీ మీరు అని అడుగుతుంది.
ప్లంబర్ని మేడమ్.. ట్యాంక్ క్లీన్ చేయడానికి వచ్చాను అంటాడు రణ్‌వీర్. నిర్మల వచ్చి ముందు మనోహరి గది నుంచి మొదలుపెట్టు అని చెప్పి లోపలకు వెళ్తుంది. నేరుగా మనోహరి రూమ్‌లోకి వెళ్తాడు. ఫోన్ మాట్లాడుతున్న మనోహరి రణ్‌వీర్‌ని చూసి షాకవుతుంది.
రణ్‌వీర్ నుంచి మనోహరి ఎలా తప్పించుకుంటుంది? అమర్‌కి నిజం తెలిసిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే జులై 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!