Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 20th July Episode) మనోహరి కోసం రణ్‌వీర్ మనుషులు అమర్ ఇంటి దగ్గర కాపలా కాస్తారు. అమర్ తల్లిదండ్రులతోపాటు మనోహరి కూడా కారులో గుడికి బయల్దేరడం చూసి రణ్‌వీర్‌కి ఫోన్ చేసి చెప్తారు. ఈ రోజు ఎలాగైనా మనోహరిని పట్టుకోవాలని వెంటనే గుడికి బయల్దేరతాడు రణ్‌వీర్.
అమర్, భాగీ జీప్‌లో వెళ్తూ ఉంటారు. ఏం మాట్లాడకుండా సీరియస్‌గా ఉన్న అమర్‌ని చూసి ఏంటి ఈ మనిషి ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లొచ్చనుకుంటే ఇంత సీరియస్‌గా ఫేస్ పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. ఇంతలో పైనుంచి అరుంధతి డైరీ భాగీ ఒళ్లో పడుతుంది. భాగీ కంగారు పడటంతో బ్రేక్ వేస్తాడు అమర్. భాగీ చేతిలోని డైరీని చూసి ఇది ఆరు డైరీ అంటాడు.
ప్రతిరోజూ జరిగే విషయాలన్నీ ఈ డైరీలో రాసుకునేది, రాగానే నాకు చదివి వినిపించేది అంటాడు. అదేంటి.. డైరీ పర్సనల్ కదా మీరెలా విన్నారు అంటుంది భాగీ. రోజూ పిల్లలు, అమ్మా నాన్న, నా గురించే రాసేది. మేము కాకుండా ఇంకేదైనా ఉందేమో తెలుసుకోవాలనే కోరికతో వినేవాన్ని. కానీ నా కోరిక తీరనేలేదు. తన జీవితమంతా మమ్మల్నే నింపుకుంది అని బాధపడతాడు అమర్.
ఈ డైరీలో మా గురించి కాకుండా ఎవరి గురించైనా రాసిందంటే అది నీ గురించే అంటాడు అమర్. అదేంటీ.. నా గురించి రాయడం ఏంటి? నాకు, అక్కకు అసలు పరిచయం లేదు కదా ఎలా నా గురించి రాస్తుంది? అని అడుగుతుంది భాగీ. నీ గురించి కాదు నీరజ అని ఆరు ఫ్రెండ్.. తన గురించి అని చెప్పి కవర్ చేస్తాడు అమర్. అసలు అక్క చివర్లో ఏం రాసిందో చదివారా? అంటుంది భాగీ.
లేదు.. తన రాతల్లో చదవలేకపోయాను అంటాడు అమర్. ఇద్దరూ గుడికి చేరుకుంటారు. అందరూ వచ్చేవరకు వెయిట్ చేద్దామా, లోపలకి వెళ్దామా? అంటాడు అమర్. రామయ్య అడుగుజాడల్లో సీతమ్మ నడుస్తుంది. కానీ, సీతమ్మ తల్లి రామయ్యకు దారి చూపదండీ అంటుంది భాగీ. ఏయ్ లూస్.. నేనేం అడిగాను.. నువ్వేం చెబుతున్నావు? అని చిరాగ్గా అక్కడ నుంచి వెళ్తాడు.
అసలు నా మాటలు నిదానంగా వింటే కదా.. నేనేం చెబుతున్నానో అర్థమయ్యేది అనుకుంటూ అమర్ వెనకాలే నడుస్తూ డాష్ ఇస్తుంది. ఏయ్.. మీదమీద పడకు.. రెండు ఫీట్ల డిస్టెన్స్ మెయింటేన్ చేయ్ అంటాడు అమర్. మూడు ముళ్లు, ఏడడుగులతో ఒక్కటయ్యాక ఈ డిస్టెన్స్ అవసరమంటావా? అంటుంది భాగీ. అమర్ కోపంగా చూడటంతో అవసరమే అంటూ దూరంగా జరుగుతుంది.
ఇద్దరూ నడుస్తుంటే భాగీ కంట్లో నలక పడుతుంది. అమర్ మెల్లిగా నలుసు తీస్తుంటే అప్పుడే రాథోడ్, అమర్ తల్లిదండ్రులు, మనోహరి గుడి దగ్గరకు వస్తారు. అమర్, భాగీని చూసి వాళ్లని డిస్టర్బ్ చేయకుండా మనం అటువైపు నుంచి వెళ్దామంటూ మనోహరిని బలవంతంగా లాక్కెళ్తుంటాడు రాథోడ్. వాళ్లని చూసిన అమర్ ఎందుకు అటు వెళ్తున్నారు అని పిలుస్తాడు.
మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అంటే.. ఏంటి అందరూ ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు. ఏమైంది మీకు.. మిస్సమ్మ కంట్లో నలకపడితే తీస్తున్నానంతే అంటాడు. హమ్మయ్య అనుకుంటుంది మనోహరి. అయ్యో.. అంతేనా అని నిరాశపడతాడు రాథోడ్. వెంటనే పంతులుకి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కొమంటాడు అమర్. పంతులుకి ఫోన్ చేస్తాడు రాథోడ్.
తనకి అర్జెంట్ పనుంటే కొడైకెనాల్ వచ్చేశానని, తన అన్నయ్య ఆ వ్రతం చేయిస్తాడని చెబుతాడు పంతులు. కానీ, ఆయన ముక్కోపి అని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. అమర్ కాళ్లు కడుక్కుని వెళ్తుంటే ఆ అడుగుల్లో నడుస్తుంది భాగీ. ఏంటని కోపంగా మాట్లాడుతుంది మనోహరి. భర్త అడుగుజాడల్లో నడుస్తున్నా అంటున్న భాగీని ఆపి ఆ స్థానం ఎప్పటికైనా నాదే అంటుంది మనోహరి. తర్వాత అందరూ గుళ్లోకి వెళ్తారు.