కమిటీ కుర్రాళ్లు మూవీతో ప్రొడ్యూసర్‌గా తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. తెలంగాణ ప్రభుత్వం అందజేసిన గద్దర్ అవార్డ్స్‌లో కమిటీ కుర్రాళ్లు మూవీ రెండు పురస్కారాలను దక్కించుకున్నది. ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెల రెండో మూవీ బుధవారం ప్రారంభమైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. అతడికి జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
ఈ సినిమాకు డైరెక్టర్ మానస శర్మ కథను అందించగా.... స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల సమకూర్చుతున్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట మల్లిడి కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరగనుంది.
ఫాంటసీ కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, జబర్ధస్త్ రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను నిర్మించాలనే ఉద్దేశంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది నిహారిక కొణిదెల.
ఓ వైపు ప్రొడ్యూసర్‌గా సినిమాలు నిర్మిస్తూనే యాక్టింగ్‌పై ఫోకస్ పెడుతోంది. ఇటీవలే తమిళంలో మద్రాస్‌కారణ్ అనే సినిమా చేసింది.