New Year Special: న్యూ ఇయర్ రోజునే బుల్లితెర మెగాస్టార్ కొత్త సీరియల్ ప్రారంభం- మరో స్పెషల్‌తో జీ తెలుగు డబుల్ ధమాకా!
New Year 2025 Special Zee Telugu Serial Chamanthi: న్యూ ఇయర్ 2025 సందర్భంగా రెండు స్పెషల్స్‌తో జీ తెలుగు డబుల్ ధమాకా అందించనుంది. బుల్లితెర ప్రభాకర్ కీలక పాత్రలో నటించిన సరికొత్త సీరియల్ చామంతి న్యూ ఇయర్ రోజునే ప్రారంభం కానుండగా మరో స్పెషల్ ఈవెంట్ ప్రసారం చేయనున్నారు.
Zee Telugu Double Dhamaka For New Year 2025: అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది.
అదిరిపోయే ట్విస్టులు
ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 రాత్రి 10 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారు. ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగే సీరియల్స్ అందిస్తున్న జీ తెలుగు మరో ఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్‌ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది.
‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31, సరికొత్త సీరియల్ చామంతి జనవరి 1న (బుధవారం) ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు. అయితే, ఖమ్మం వేదికగా జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ సరిగమప పార్టీకి వేళాయెరా కార్యక్రమానికి యాంకర్ రవి, లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
నిండు నూరేళ్ల సావాసం నుంచి
ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులు జీ తెలుగు సీరియల్ నటీనటులతో పోటీపడ్డారు. మేఘసందేశం సీరియల్ నుంచి గగన్ (అభినవ్), భూమి (భూమిక), నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి అమరేంద్ర (రిచర్డ్ జోస్), అరుంధతి (పల్లవి గౌడ), భాగమతి (నిసర్గ గౌడ), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నుంచి మిత్ర (రఘు), లక్ష్మి (మహి గౌతమి) తదితరులు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
హృదయాన్ని హత్తుకునే పాటలు, ఉల్లాసకరమైన ఆటలు, అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. పాటల పోటీలు, కామెడీ స్కిట్లు, అందాల పోటీలు నిర్వహించడమే కాకుండా ఈ వేదికపై ప్రతిభావంతులైన దివ్యాంగులను ప్రోత్సహించింది జీ తెలుగు. 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలుకుతూ అభిమానుల కోలాహలంతో సాగిన ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూసేయండి అని ప్రకటించారు.
జమీందారీ కుటుంబంలో
ఇక చామంతి సీరియల్ కథ విషయానికొస్తే.. చలాకీ అమ్మాయి అయిన చామంతి (మేఘనా లోకేష్) తన కుటుంబంతో ఊరిలో జీవిస్తుంది. చామంతి కుటుంబం ఆ ఊరిలో జమీందారీ ఇంట్లో నమ్మకంగా పని చేస్తుంది. చామంతి తండ్రి - రామచంద్రయ్య (ప్రభాకర్), తల్లి మూగ. చామంతి అక్క రోజా వాయుపుత్ర ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తుంది.
ఇక జమీందారీ కుటుంబ సహాయంతో ఎదిగిన వ్యక్తి వాయుపుత్ర ఎయిర్‌లైన్స్ ఎండీ హర్షవర్ధన్. అతని వారసులు అరుణ్, ప్రేమ్. పల్లెటూరిలో ఉండే చామంతి హైదరాబాద్ ఎలా చేరుకుంది? చామంతి, ప్రేమ్ మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? రోజా హర్షవర్ధన్ ఇంటికి ఎలా చేరుకుంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే చామంతి సీరియల్ చూడాల్సిందే.
బుల్లితెర మెగాస్టార్
ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథాంశంతో చామంతి సీరియల్ ప్రేక్షకులను అలరించనుంది. మేఘనా లోకేష్, ఆశిష్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్‌లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, మౌనిక, భార్గవ్ రామ్, ఐశ్వర్య, శశిధర్, శ్రియ రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ఏడాదిని ముగిస్తూ డిసెంబర్ 31న, రాత్రి 10 గంటలకు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’. కొత్త సంవత్సర వేళ జనవరి 1న చక్కని కథతో కొత్త సీరియల్ చామంతి ప్రసారం కానున్నాయి. ఇలా ఈ రెండింటితో జీ తెలుగు డబుల్ ధమాకా అందించనుంది.