New Serial: నమ్మకద్రోహానికి బలైన ఇద్దరి వ్యక్తుల జీవితం- జీ తెలుగులో సరికొత్త సీరియల్- మారిన ఆ సీరియల్ టైమ్
Kalavaari Kodalu Kanakamahalakshmi Serial On Zee Telugu: జీ తెలుగు ఛానెల్‌లో సరికొత్త సీరియల్ కలవారి కోడలు కనకమహాలక్ష్మీ ప్రారంభం కానుంది. తండ్రీ కూతుళ్ల మధ్య అనురాగం, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చూపించే ఈ సీరియల్ ఏ రోజు నుంచి ప్రారంభం కానుందనే వివరాల్లోకి వెళితే..
New Serial Kalavaari Kodalu Kanakamahalakshmi: ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగే సీరియల్స్‌ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం, జగద్దాత్రి, మా అన్నయ్య, మేఘసందేశం వంటి సీరియల్స్ ఆరంభం నుంచే అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
నమ్మకద్రోహానికి బలి
ఈ తరుణంలో మరో ఆసక్తికరమైన కథ, కథనంతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ బుల్లితెర ఛానెల్ జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’. నమ్మకద్రోహానికి బలైన ఇద్దరు వ్యక్తుల జీవితమే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ ఆకట్టుకునే కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉద్వేగభరితంగా
తండ్రీకూతుళ్ల బంధం, భార్యాభర్తల అనుబంధం మధ్య ఉద్వేగభరితంగా సాగే సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ఆగస్టు 5న ప్రారంభం కానుంది. ఆగస్ట్ 5 నుంచి జీ తెలుగు ఛానెల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ధారావాహిక.
దుష్ట పన్నాగానికి
కూతురు భవిష్యత్తు కోసం ఆరాటపడే తండ్రి, ఆయన సంతోషం కోసం పాటుపడే కూతురు, తండ్రి కోరికను గౌరవించడం తప్ప మరో కల లేని కనకమహాలక్ష్మి కథే ఈ సీరియల్. తండ్రి కోరిక మేరకు డిగ్రీ పూర్తి చేసిన కనకమహాలక్ష్మి ఓ దుష్ట పన్నాగానికి బలైపోతుంది. అదే ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. మరోవైపు బాధ్యతాయుతమైన కొడుకుగా ఉన్న విష్ణు విహారి జీవితం నమ్మకద్రోహానికి బలవుతుంది.
విధిని ఎదిరించి
విష్ణు విహారిని కలుసుకున్న కనకమహాలక్ష్మి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అనూహ్యంగా జరిగే వివాహంతో ఈ ఇద్దరి జీవితాలు ముడిపడతాయి. ప్రేమ, పెళ్లి, విధి నడుమ సాగే కథ ఉత్కంఠ రేపే మలుపులతో ఆకట్టుకుంటుంది ఈ సీరియల్. విధిని ఎదిరించి కనకం, విష్ణు వారి జీవన ప్రయాణంలోని అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారు? అనేది తెలియాలంటే కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ తప్పకుండా చూడాల్సిందే అని మేకర్స్ చెబుతున్నారు.
పాపులర్ నటి ప్రియ
ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో తెరకెక్కిన కలవారి కోడలు కనకమహాలక్ష్మి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పాపులర్ నటి ప్రియ ఈ సీరియల్‌లో ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. విష్ణు విహారి పాత్రలో నటిస్తున్న జై ధనుష్ తన నటనతో తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటాడని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యుక్తా మల్నాడ్ మెయిన్ రోల్
‘వైదేహి పరిణయం’ సీరియల్‌లో వైదేహిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన యుక్తా మల్నాడ్ ఈ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ సీరియల్‌లో కనకం పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. కనకమహాలక్ష్మి తండ్రిగా విశ్వమోహన్ నటిస్తున్నారు. మీరూ ఈ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రతిరోజూ మిస్ కాకుండా చూసేయండి అంటూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఆ సీరియల్ టైమ్ చేంజ్
కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ ప్రారంభంతో సూర్యకాంతం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారమవుతుంది. ప్రేక్షకులు ఈ మార్పును గమనించగలరు అని జీ తెలుగు తెలిపింది.