Tantiram Review: తంతిరం రివ్యూ.. కొత్త తెలుగు హారర్ మూవీ భయపెట్టిందా అంటే?
Tantiram Movie Review: తెలుగులో అనేక హారర్ మూవీస్ వచ్చిన కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. ఓటీటీల్లో కూడా అనేక చిత్రాలు మెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి వచ్చిన కొత్త తెలుగు హారర్ మూవీ తంతిరం మూవీ రివ్యూలోకి వెళితే..
టైటిల్: తంతిరం
నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూరు
సినిమాటోగ్రఫీ: ఎస్ వంశీ శ్రీనివాస్
ఎడిటింగ్: ఎస్ వంశీ శ్రీనివాస్
సంగీతం: అజయ్ అరసాడ
నిర్మాత: శ్రీకాంత్ కండ్రేగులు
దర్శకత్వం: ముత్యాల మెహర్ దీపక్
థియేటర్ విడుదల తేది: అక్టోబర్ 13, 2023
ఓటీటీ రిలీజ్ డేట్: నవంబర్ 11, 2023
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
Tantiram Review In Telugu: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ హారర్ మూవీ తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1. అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా నెలరోజులకు చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఎప్పుడెప్పుడు హారర్ సినిమాలు చూద్దామా అని ఎదురుచూసే సినీ ప్రియులకు కొత్త మూవీ వచ్చిపడినట్టయింది. మరి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న తంతిరం మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఓ ఊరిలో క్రాకర్స్ ఫ్యాక్టరీని నడుపుతాడు అదీబన్ (అవినాష్ ఎలందూరు). అతని భార్య లేచిపోతుంది. ఫ్యాక్టరీని తన కొడుకును చూసుకుంటాడు అదీబన్. అయితే, భార్య లేకపోవడంతో ఓ అమ్మాయిని ఉంచుకుని ఫ్యాక్టరీ బాధ్యతలను కొడుకు బాలచంద్రన్‌కు (శ్రీకాంత్ గుర్రం) అప్పజెపుతాడు అదీబన్. అమ్మాయిలు అంటే ఇష్టం లేని బాలచంద్రన్‌కు అలాగిని (ప్రియాంక శర్మ) అనే యువతితో బలవంతంగా పెళ్లి జరిపిస్తాడు అదీబన్.
ఆసక్తికర అంశాలు
పెళ్లి తర్వాత బాలచంద్రన్ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటీ? ఎంతో అందంగా ఉండే అలాగినిపై ఎవరి కన్ను పడింది? బాలచంద్రన్ క్రాకర్స్ ఫ్యాక్టరీకి లాభాలు ఎలా వచ్చాయి? జెన్‌లు అంటే ఎవరు? వారు ఏం కోరుకుంటారు? వంటి అనేక ఆసక్తికర అంశాల సమ్మేళనమే తంతిరం మూవీ.
విశ్లేషణ:
గౌతముడు, అహల్య రాయిగా మారడం వంటి మైథాలజీ స్టోరీతో తంతిరం సినిమా చాలా ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. డ్రింక్ చేసేందుకు ఓ చోట కూర్చుని తన ఫ్రెండ్స్‌తో విజయ్ అనే యువకుడు హారర్ స్టోరీ చెబుతూ కథలోకి తీసుకెళ్లారు. దానికంటే ముందు అలాడిన్ వద్ద ఉండే జీనీ వంటి వారు అయిన జెన్‌ల నేపథ్యం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలా కథలోకి ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లిన డైరెక్టర్ మెయిన్ పాయింట్ చెప్పడానికి కాస్తా టైమ్ తీసుకున్నారు.
తండ్రి ఇచ్చే ట్విస్ట్
సినిమా స్టోరీ చాలా బాగున్నా బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమా నిడివి మొత్తం గంటన్నర ఉన్నప్పటికీ పెద్దగా థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉండవు. ప్రారంభంలో చెప్పిన పది నిమిషాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఏం జరుగుతుందో అని చివరి వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. మధ్యలో కొంత ఆసక్తిగా ఉన్నా క్లైమాక్స్‌లోనే ఏం జరిగిందనేది తెలుస్తుంది. దాదాపు గంటలోపు సినిమా చెప్పేయొచ్చు. అయితే, తండ్రి అదీబన్ విషయంలో వచ్చే ట్విస్ట్ ఊహించలేం.
అసలు కథ అప్పుడే
క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఓకే. సినిమాలో చాలా వరకు ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నింటికి చాప్టర్ 2లో రివీల్ చేస్తామని మూవీ ఎండింగ్‌లో చెప్పారు. అంటే, దీనికి సీక్వెల్ ఉందన్నమాట. ఇక అజయ్ అరసాడ బీజీఎమ్ బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, సాంకేతిక విలువలు కూడా ఓకే. శ్రీకాంత్, ప్రియాంక, అవినాష్ నటన బాగుంది. ప్రియాంక అందంగా కనిపించింది. తమ పాత్రలకు అంతా న్యాయం చేశారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
ఫైనల్‌గా చెప్పాలంటే, తంతిరం చాప్టర్ 1లో మెయిన్ పాయింట్‌ను చాలావరకు సాగదీసి చెప్పారు. అసలు కథను రెండో పార్టులో చెప్పనున్నట్లు తెలుస్తోంది. రెండో పార్ట్‌పై బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కాబట్టి రెండో పార్ట్ కోసం అయినా టైమ్ పాస్‌కి ఫ్రీ టైమ్‌లో తంతిరం చాప్టర్ 1 చూడొచ్చు.