బాలీవుడ్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సితారే జమీన్ పర్ చిత్రంపై చాలా క్యూరియాసిటీ నెలకొంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమిర్ సినిమా వస్తుండటంతో హైప్ బాగా ఉంది. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. సితారే జమీన్ పర్ సినిమా ట్రైలర్ తాజాగా వచ్చింది. అయితే, ఈ ట్రైలర్‌పై ట్రోలింగ్ వస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
సితార్ జమీన్ పర్ చిత్రం స్పానిష్ మూవీ ఛాంపియన్స్ (2018)కు కాపీలా ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీ హాలీవుడ్‍లోనూ ఛాంపియన్స్ పేరుతో రీమేక్ అయింది. మానసిక స్థితి సరిగా లేని కొందరికి ఓ వ్యక్తి బాస్కెట్ బాల్ కోచ్ కోచింగ్ ఇవ్వాల్సి రావడం, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు, వారి జీవితాలు ఎలా మారాయన్న విషయాల చుట్టూ (ఛాంపియన్స్ మూవీ ఉంటుంది.
సితారే జమీన్ పర్ సినిమా కూడా ఇదే స్టోరీలైన్‍పై ఉందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేని కొందరికి ఆమిర్ ఖాన్ బాస్కెట్ బాల్ కోచింగ్ ఇస్తుంటారు. దీంతో ఛాంపియన్స్ మూవీకి రీమేక్‍గా వస్తోందని అర్థమవుతోంది.
సితారే జమీన్ పర్ సినిమా ట్రైలర్లోని కొన్ని షాట్స్.. ఛాంపియన్స్ చిత్రంలోని సీన్లతో కలిపి కొందరు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేశారు. అవి అచ్చం ఒకేలా ఉన్నాయి. “కథ తీసుకుంటే ఓకే కానీ.. సీన్లను తీసే విధానం కూడా మార్చకపోతే ఎలా.. వాటిని కూడా కాపీ కొట్టాలా” అని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ అచ్చు దింపేశారని, ఎందుకిలా అని ప్రశ్నిస్తున్నారు. సినిమాను ఫ్రేమ్‍లతో సహా మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ కాపీ కొట్టేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఫారెస్ట్ గంప్ నుంచి ఆమిర్ ఇంకా బయటికి రాలేదా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఛాంపియన్స్ ఈ మూవీ అంత ఫేమస్ కాదులే, సేఫ్ అంటూ కొందరు వెటకారంగా పోస్టులు చేస్తున్నారు. ఫారెస్ట్ గంప్ చిత్రానికి హిందీ రీమేక్‍గా లాల్ సింగ్ ఛద్దా (2022) మూవీ చేశారు ఆమిర్. ఇది భారీ డిజాస్టర్ అయింది. ఈ చిత్రం తర్వాత మూడేళ్ల గ్యాప్ అనంతరం సితారే జమీన్ పర్ మూవీతో ఆమిర్ వస్తున్నారు. ఈ సినిమా కూడా రీమేక్‍గానే వస్తోంది. స్టోరీలైన్ ఒకేలా అనిపిస్తోంది. కాపీ విమర్శలపై మూవీ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.
కాగా, సితారే జమీన్ పర్ ట్రైలర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎఫెక్షన్‍తో పాటు హృదయాన్ని తాకే మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా 10 మంది నటీనటులు తెరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో జెనీలియా కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.
సితారే జమీన్ పర్ సినిమా జూన్ 20న విడుదల కానుంది. తారే జమీన్ పర్ (2007) చిత్రానికి రీమేక్ అయినా.. స్టోరీ మాత్రం పూర్తిగా వేరేది. ఈ చిత్రానికి దివ్య్ నిధి శర్మ కథ అందించగా.. డైరెక్టర్ ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించారు. ఈ సినిమాకు శంకర్ - ఇషాన్ - లాయ్, రామ్ సంపత్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు.
సంబంధిత కథనం