Prakash Raj On Chandrayaan 3 : చంద్రయాన్ 3పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు.. ఏమయ్యా ఇది పద్ధతేనా?
Prakash Raj On Chandrayaan 3 : ఒకవైపు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇంతలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్ టీ పోస్తున్న క్యారికేచర్‌తో కూడిన పోస్ట్‌ను ప్రకాష్ రాజ్ పంచుకున్నారు.
భారతీయ సినిమా అగ్ర నటుల్లో ఒకరైన నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) దక్షిణాది సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వాంటెడ్, సింగం, దబాంగ్ 2, పోలీసుగిరి వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన తరచూ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని ట్వీట్ల ద్వారా ప్రశ్నిస్తుంటారు. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా పలు ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఇప్పుడు చంద్రయాన్-3(Chandrayaan 3) గురించి ఆయన చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు ముందు ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌ను వెక్కిరిస్తూ చేసిన ట్వీట్ అని, ఇది ప్రకాష్ రాజ్ నుంచి వస్తుందని ఊహించలేదని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఒకవైపు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఇస్రో మాజీ చీఫ్ కె. శివన్ టీ పోస్తున్న క్యారికేచర్‌తో కూడిన పోస్ట్‌ను ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. 'బ్రేకింగ్ న్యూస్ మూన్ నుండి విక్రమ్ ల్యాండర్ మొదటి చిత్రం Wowwww #justasking' క్యాప్షన్ ఇచ్చారు.
ప్రకాష్ రాజ్ వ్యంగ్యానికి నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 'మీ దేశం, మీ ప్రజల పురోగతి, విజయాలు, ప్రయత్నాలను మీరు అసహ్యించుకోవడం ప్రారంభించేంత ద్వేషం మీకు ఉందా.. ఇది సరికాదు.' అని విమర్శిస్తున్నారు.
ISROకు తక్కువ వనరులు, సరైన వాతావరణం లేనప్పటికీ బాగా రాణిస్తుందని నెటిజన్ల మద్దతు ఇస్తున్నారు. కొన్ని దేశాలు మాత్రమే సాధించిన ఘనతను సాధించేందుకు ఇస్రో ఇప్పుడు అత్యుత్తమ స్థితిలో ఉందని అంటున్నారు. తనకు ఇంత ఇచ్చిన దేశాన్ని ద్వేషిస్తున్నాడని చాలా మంది విమర్శిస్తున్నారు.
సెప్టెంబర్ 2017లో తన స్నేహితురాలు గౌరీ లంకేశ్ హత్యకు గురైన తర్వాత ప్రకాష్ రాజ్ #justasking అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నలు వేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇక చంద్రయాన్-3 ఆగష్టు 23, 2023 (బుధవారం) చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
ప్రకాష్ రాజ్ ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఎనిమిది నంది అవార్డులు, ఎనిమిది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు SIIMA అవార్డులు.. ఇలా చాలా అవార్డులు అందుకున్నారు. అలాంటి వ్యక్తి చంద్రయాన్ 3పై కామెంట్లు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.