Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు ది రాయల్స్. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, నోరా ఫతేహిలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ను మంగళవారం (ఏప్రిల్ 22) రిలీజ్ చేశారు. మోర్పూర్ రాయల్ కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది.
ఒకప్పటి రాచరికాన్ని, అప్పటి విలాసవంతమైన జీవితాన్ని ఈ కాలంలోనూ కొనసాగించి అప్పుల పాలయ్యే ఓ రాజకుటుంబం కథే ది రాయల్స్ వెబ్ సిరీస్. ఈ సరికొత్త సిరీస్ మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. మోర్పూర్ అనే రాజవంశం విలాసాలకు పోయి అప్పుల పాలవుతుంది.
ఆ సామ్రాజ్యానికి వారసుడిగా అవిరాజ్ సింగ్ (ఇషాన్ ఖట్టర్) ఉంటాడు. మరోవైపు జీవితంలో ఓ పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని కలలు కనే సోఫియా కన్మని శేఖర్ (భూమి పెడ్నేకర్).. ఈ రాజవంశాన్ని మళ్లీ గాడిలో పెట్టే పనిని భుజానికెత్తుకుంటుంది. అసలు ప్రపంచాన్ని ఎవరు ఏలుతున్నారో తేల్చుకునే రేసు అటు అవిరాజ్, ఇటు సోఫియా మధ్య మొదలవుతుంది.
ఈ ది రాయల్స్ వెబ్ సిరీస్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ట్రైలర్లో రొమాన్స్ తోపాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉండటంతో ఈ సిరీస్ ను చూసేందుకు వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ సిరీస్ లో కీలకపాత్రలు పోషిస్తున్న జీనత్ అమన్, భూమి పెడ్నేకర్, నోరా ఫతేహి లాంటి వాళ్ల కోసం ఎదురు చూస్తున్నట్లు పలువురు అభిమానులు కామెంట్స్ చేశారు.
ది రాయల్స్ వెబ్ సిరీస్ ను ప్రియంకా ఘెోస్, నుపుర్ ఆస్తానా డైరెక్ట్ చేశారు. నేహా వీణా శర్మ కథ అందించింది. ప్రితీష్ నంది కమ్యూనికేషన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ షోలో బాలీవుడ్ లోని ప్రముఖ నటీనటులు ఎంతో మంది నటించారు.
ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్ లతోపాటు నోరా ఫతేహి, చుంకీ పాండే, మిలింద్ సోమన్, డీనో మోరియా, సాక్షి తన్వర్ లాంటి వాళ్లు నటించారు. ది రాయల్స్ వెబ్ సిరీస్ మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం