Netflix Releases: బ్లాక్‌బస్టర్ సినిమాల హక్కులు సొంతం చేసుకుంటూ నెట్‌ఫ్లిక్స్ దూకుడు పెంచుతోంది. తాజాగా మరో రెండు అలాంటి సినిమాలనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. వీటిలో ఒకటి మలయాళం థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒకటి. ఇక మరొకటి గత నెల రిలీజైన తమిళ కామెడీ డ్రామా డ్రాగన్.
నెట్‌ఫ్లిక్స్ ప్రతి వారంలాగే ఈవారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అందులో భాగంగా గురువారం (మార్చి 20) మలయాళం థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీని స్ట్రీమింగ్ చేయనుంది. కుంచకో బొబన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. ఓ నకిలీ గోల్డ్ చెయిన్ ను తాకట్టు పెట్టడానికి ప్రయత్నించే వ్యక్తిపై వచ్చిన ఫిర్యాదు ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుంచకో బొబన్ నటించాడు. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఇక నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తున్న మరో తమిళ కామెడీ మూవీ డ్రాగన్. ఈ మూవీ శుక్రవారం (మార్చి 21) నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ డ్రాగన్ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
డ్రాగన్ మూవీని రూ.37 కోట్లతో నిర్మించగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎంతో ఆసక్తి రేపుతోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రానుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఓటీటీలో డ్రాగన్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లో ఈ రెండు సినిమాలే కాకుండా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా రానుంది. ఈ సిరీస్ పేరు ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్. ఈ సిరీస్ గురువారం (మార్చి 20) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. గతంలో ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ రాగా.. ఇప్పుడీ కొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం