ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ లోకి మే నెల చివరి వారంలో కొన్ని ఇంట్రెస్టింగ్, బ్లాక్‌బస్టర్ సినిమాలు రాబోతున్నాయి. ఇవి ఈ నెల 25 నుంచి 31 మధ్య స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో నాని నటించిన హిట్ 3తోపాటు సూర్య రెట్రో, సల్మాన్ ఖాన్ సికందర్ మూవీస్ ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మే 25 నుంచి 31 మధ్య మూడు భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఈ మూడూ మూడు భాషలకు చెందిన సినిమాలు కావడం విశేషం. వీటిలో నాని నటించిన హిట్ 3 బ్లాక్‌బస్టర్ హిట్ కాగా.. రెట్రో, సికందర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన మూవీ సికందర్. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదివారం (మే 25) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పూర్తిగా నెగటివ్ రివ్యూలు వచ్చాయి.
అయినా బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకుపైగానే వసూలు చేసింది. కానీ సల్మాన్ ఖాన్ రేంజ్ కు ఇది చాలా చాలా తక్కువనే చెప్పాలి. అది కూడా రంజాన్ కు రిలీజయ్యే సల్మాన్ సినిమాల్లో ఇలా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడేవి తక్కువే. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇక నాని నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ హిట్ 3 ఈ వారమే నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ గురువారం (మే 29) నుంచి స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ మూవీని కూడా తెలుగుతోపాటు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేసిన హిట్ 3 ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతోంది. హిట్ యూనివర్స్ నుంచి ఈ మూడో సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించింది. ఇందులో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ పాత్రలో నాని నటించాడు. కాస్త హింస ఎక్కువైందన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ రెట్రో కూడా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మే 31న నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ కూడా భారీ అంచనాల మధ్య రిలీజైనా.. నెగటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
ముఖ్యంగా తమిళనాడులోనే చిన్న సినిమా అయినా టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఈ మూవీని మించి వసూళ్లు సాధించడం విశేషం. సూర్య నటించిన గత మూవీ కంగువ కూడా నిరాశనే మిగిల్చింది. మరి ఇప్పుడీ రెట్రో మూవీకి నెట్‌ఫ్లిక్స్ లో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.
సంబంధిత కథనం