Action OTT: ఐదు వందల కోట్ల తెలుగు మూవీ ఓటీటీలోకి వస్తోంది - రెండు స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్
Action OTT: ఎన్టీఆర్ దేవర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. నవంబర్ 22 నుంచి హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.

Action OTT: ఎన్టీఆర్ దేవర మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 155 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.
రెండు రిలీజ్ డేట్స్...
థియేటర్లలో రిలీజైన నలభై రోజుల తర్వాత దేవర మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెబుతోన్నారు. నవంబర్ 8 నుంచి తెలుగుతో పాటుతమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ మాత్రం నవంబర్ 22న విడుదలకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవర ఓటీటీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతోన్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్...
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ యాక్షన్ డ్రామా మూవీలో దేవర, వరగా డ్యూయల్ రోల్‌లో ఎన్టీఆర్ నటించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు.
500 కోట్ల కలెక్షన్స్...
దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 500 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. తొలిరోజే ఇండియా వైడ్‌గా 82 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ కల్కి తర్వాత ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న మూవీగా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది.
దేవర మూవీ కథ ఇదే...
ఎర్ర సముద్రంలోని నాలుగు ఊళ్లకు దేవర (ఎన్టీఆర్) నాయకుడిగా ఉంటాడు. తన స్నేహితుడు రాయప్ప(శ్రీకాంత్), మరో ఊరి పెద్ద భైరతో (సైఫ్ అలీఖాన్) కలిసి మురుగ (మురళీ శర్మ) కోసం పనిచేస్తుంటాడు దేవర. నౌకల్లో మురుగ దిగుమతి చేసుకుంటున్న అక్రమ ఆయుధాల్ని నావీ అధికారుల కంటపడకుండా ఒడ్డుకు చేరుస్తుంటాడు దేవర.
ఈ అక్రమ ఆయుధాల కారణంగా తమ ప్రాంతానికే చెందిన ఓ వ్యక్తి చనిపోవడంతో మురుగ కోసం పనిచేయకూడదని దేవర నిర్ణయించుకుంటాడు.
తన మాటను కాదని మురుగ కోసం పనిచేయడానికి వెళ్లిన వారిని దేవర శిక్షిస్తాడు. దేవరకు భయపడి ఎర్రసముద్రం ప్రాంత ప్రజలు సముద్రంలోకి అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అక్రమ ఆయుధాల వ్యాపారం సజావుగా సాగడానికి దేవర అడ్డు తొలగించాలని భైరా ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా దేవర ఎవరికి కనిపించకుండా అదృశ్యమవుతాడు.
దేవర కొడుకు వర (ఎన్టీఆర్) పిరికివాడిగా పెరుగుతాడు. కళ్లముందు అన్యాయం జరుగుతున్నా ఎదురించలేకపోతాడు.స్నేహితుడైన భైర తనను చంపాలనుకున్న విషయం తెలిసి దేవర ఏం చేశాడు?
అతడు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? వర భయస్తుడిగా అందరి ముందు నటించడానికి కారణం ఏమిటి?? తండ్రి లక్ష్యాన్ని వర ఎలా పూర్తిచేశాడు? వరను ప్రేమించిన తంగం (జాన్వీ కపూర్) ఎవరు అన్నదే దేవర మూవీ కథ. దేవర మూవీకి సెకండ్ పార్ట్ కూడా రానుంది. ఇప్పటికే పార్ట్ 2కు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.