Netflix Nayanthara: నయనతార ‘బియాండ్ ది ఫెయిరీటేల్’ ట్రైలర్ విడుదల.. అంచనాల్ని పెంచేసిన లేడీ సూపర్ స్టార్
Nayanthara documentary: రెండేళ్లుగా నయనతార అభిమానుల్ని ఊరిస్తూ వస్తున్న డాక్యుమెంటరీ రిలీజ్‌పై ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. శనివారం రిలీజైన ట్రైలర్.. ఈ డాక్యుమెంటరీపై అంచనాల్ని మరింత పెంచింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార తన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకూ గోప్యంగానే ఇన్నాళ్లు ఉంచుతూ వచ్చింది. తన చుట్టూ ఎన్ని వివాదాలు నడిచినా.. హుందాగా స్పందిస్తూ వచ్చింది. అయితే.. తొలిసారి నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రాబోతోంది
19 ఏళ్ల సినీ జర్నీ
19 ఏళ్ల క్రితం చంద్రముఖి సినిమాతో తెరంగేట్రం చేసిన నయనతార.. ఈ సుదీర్ఘ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఒకానొక దశలో ఐరెన్ లెగ్ ముద్రని ఎదుర్కొంది. ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లో పెద్దగా కనిపించని నయన్.. మీడియా ముందుకు రావడం కూడా చాలా అరుదు.
సౌత్‌లో ఇప్పటికే దాదాపు అందరి స్టార్‌లతో కలిసి పనిచేసిన నయనతార.. గత ఏడాది తన బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అట్లీ యాక్షన్ థ్రిల్లర్ జవాన్‌లో షారూక్ ఖాన్‌తో ఆడిపాడింది. ఇప్పుడు నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు శనివారం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఆ ట్రైలర్ లో ఏముంది?
నయనతార సాధారణ నటి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన క్రమాన్ని ఈ డాక్యుమెంటరిలో చూపించారు.ఆమెతో కలిసి పనిచేసిన రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, నాగార్జున అక్కినేనితో పాటు ఆమె కుటుంబం, భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ సహా స్నేహితులు నయనతార గురించి ఆసక్తికరమైన విషయాల్ని ఈ డాక్యుమెంటరీలో చెప్పినట్లు ట్రైలర్‌లో చూపించారు. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార వివాహం జరగగా.. షారుఖ్ ఖాన్, మణిరత్నం వంటి ప్రముఖులు హాజరైన దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
‘‘నేను నా జీవితంలోని చాలా విషయాలను తెరపై పంచుకున్నాను. కానీ ఈ డాక్యుమెంటరీ అభిమానులకు నా బహుమతి’’ అని నయనతార చెప్పుకొచ్చింది.
‘‘నయనతార నా భార్య, నా బెస్ట్ ఫ్రెండ్, నేను నిజంగా ఇష్టపడే వ్యక్తి. ఆమె ప్రతి సవాలును ఎదుర్కొంది. అలానే ప్రతిసారీ బలంగా ఎదిగింది’’ అని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు.
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 18న ఆమె 40వ పుట్టినరోజు సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్‌కానుంది.