Netflix Movies: నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్ హవా.. ఒక్క ఏడాదిలోనే 100 కోట్ల వ్యూస్
Netflix Movies: నెట్‌ఫ్లిక్స్‌లో మన ఇండియన్ సినిమాలు, వెబ్ సిరీస్ హవా కొనసాగిస్తున్నాయి. 2023లో ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఇండియాకు చెందిన మూవీస్, షోలే 100 కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి.
Netflix Movies: నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి. దీనికి ఇండియాలోనూ క్రమంగా ప్రేక్షకులు పెరుగుతున్నారు. మిగిలిన ఓటీటీలతో పోలిస్తే కాస్త ఖరీదైనదే అయినా.. క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా ఈ ఓటీటీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇండియన్ సినిమాలు, షోలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఒక్క ఏడాదిలోనే 100 కోట్ల వ్యూస్ రావడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ రిపోర్ట్
నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం (మే 24) తన రెండో ఎంగేజ్‌మెంట్ రిపోర్టును వెలువరించింది. దీని ప్రకారం 2023 ఏడాదికిగాను ఇండియన్ సినిమాలు, షోలకు ఏకంగా 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. "వాట్ వి వాచ్డ్: ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్టు" పేరుతో ఈ రిపోర్టును సదరు ఓటీటీ రిలీజ్ చేసింది. గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి ఈ రిపోర్టును తీసుకొచ్చింది.
గతేడాది రెండో అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా 9000 గంటల నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను చూడటం విశేషం. ఇండియా నుంచి జానె జాన్ మూవీ ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. ఈ మూవీకి ఏకంగా 2.02 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఆ తర్వాత షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిలిచింది. ఈ సినిమాకు 1.62 కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడో స్థానంలో 1.21 కోట్ల వ్యూస్ తో విశాల్ భరద్వాజ్ ఖూఫియా మూవీ ఉంది.
ఇవే కాకుండా ఓఎంజీ 2, లస్ట్ స్టోరీస్ 2, డ్రీమ్ గర్ల్ 2, కర్రీ అండ్ సయనైడ్ లాంటి సినిమాలు, సిరీస్, డాక్యు సిరీస్ ఉన్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ది రైల్వే మెన్ టాప్ లో నిలిచింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ విషాద నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. 1.06 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో కోహ్రా వెబ్ సిరీస్ నిలిచింది. ఆ తర్వాత గన్స్ అండ్ గులాబ్స్, కాలా పానీ సిరీస్ లు ఉన్నాయి.
ఇంగ్లిషేతర కేటగిరీకీ మంచి డిమాండ్
ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ లోని ఇంగ్లిషేతర కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంది. మొత్తంగా చూస్తే మూడో వంతు వ్యూస్ వీటికే వస్తున్నాయి. వీటిలో కొరియన్, స్పానిష్, జపనీస్ భాషల కంటెంట్ ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత ఇండియాలోనూ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల కంటెంట్ బాగా వెళ్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ లో 2023లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ మంది చూసిన సినిమాగా లీవ్ ద వరల్డ్ బిహైండ్ నిలిచింది.
ఈ సినిమాకు ఏకంగా 12.1 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత యానిమేటెడ్ మూవీ లియో నిలిచింది. ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే వన్ పీస్ 7.2 కోట్ల వ్యూస్ తో టాప్ లో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికీ బేసిక్ ప్లాన్ ధర కూడా నెలకు రూ.199గా ఉంది. ఒకటికి మించి డివైస్ లలో చూడాలనుకుంటే మాత్రం కనీసం రూ.500 చెల్లించాల్సిందే.