Netflix Telugu Movie: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ మధ్యే వచ్చిన బ్లాక్‌బస్టర్ తెలుగు మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. గత శుక్రవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. తొలి ఐదు రోజుల్లోనే ఈ సినిమా రికార్డు వ్యూస్ తో గ్లోబల్ ట్రెండింగ్స్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో టాప్ 5లోకి రావడం విశేషం.
టాలీవుడ్ నుంచి ఈ మధ్యకాలంలో ఓ చిన్న సినిమాగా వచ్చిన సంచలన విజయం సాధించింది కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి, శివాజీలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ అలాగే దూసుకెళ్తోంది.
ఈ సినిమాకు ఇప్పటి వరకూ 22 లక్షల వ్యూస్ రావడం విశేషం. అంతేకాదు మొత్తంగా 54 లక్షల గంటలపాటు వ్యూయింగ్ టైమ్ ను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. మొత్తంగా గ్లోబల్ ట్రెండింగ్స్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీ సినిమాల జాబితాలో ఈ కోర్ట్ మూవీ ఐదో స్థానంలో ఉంది.
అటు ఏప్రిల్ 11నే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టిన మరో మూవీ ఛావా. ఈ సినిమా కూడా గ్లోబల్ ట్రెండింగ్స్ లో నాలుగో స్థానంలో ఉంది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.800 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఛావా మూవీ.. నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకూ 22 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అంటే కోర్ట్ సినిమాకు వచ్చినన్ని వ్యూసే ఈ మూవీకి కూడా వచ్చాయి.
అయితే ఛావా పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజైంది. అలాంటి సినిమాకు ఓ ప్రాంతీయ, చిన్న సినిమా అయిన కోర్ట్ ఈ స్థాయిలో పోటీ ఇవ్వడం నిజంగా విశేషమే. ఇక ఛావా మూవీ 59 లక్షల వ్యూయింగ్ హవర్స్ ను నమోదు చేసింది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ లో ఉన్న మరో ఇండియన్ మూవీ టెస్ట్. నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోనే రిలీజైన విషయం తెలిసిందే. టెస్ట్ మూవీకి 25 లక్షల వ్యూస్, 60 లక్షల వ్యూయింగ్ హవర్స్ నమోదయ్యాయి. ఈ మూవీ మూడోస్థానంలో ఉంది.
కోర్ట్ మూవీని రామ్ జగదీశ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, శివాజీతోపాటు రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించారు. పోక్సో చట్టంలోని లోతుపాతులను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో టచ్ చేశారు.
కులం, పగ ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చట్టంలోని లోసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులు ఏ విధంగా బలవుతున్నారన్నదిఅర్థవంతంగా సినిమాలో చూపించాడు.
సంబంధిత కథనం