Crime Thriller Web Series: సమంత క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు.. షూటింగ్ జరిగేనా?-netflix crime thriller web series rakt brahmand shoot hits financial issues samantha raj and dk web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thriller Web Series: సమంత క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు.. షూటింగ్ జరిగేనా?

Crime Thriller Web Series: సమంత క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు.. షూటింగ్ జరిగేనా?

Hari Prasad S HT Telugu
Published Feb 18, 2025 08:04 PM IST

Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో సమంత నటిస్తోంది. ఇప్పుడీ వెబ్ సిరీస్ కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి.

సమంత క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు.. షూటింగ్ జరిగేనా?
సమంత క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు.. షూటింగ్ జరిగేనా?

Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రక్త్ బ్రహ్మాండ్ (Rakt Brahmand) ఒకటి. గన్స్ అండ్ గులాబ్స్ తర్వాత డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే నెట్‌ఫ్లిక్స్ తో రెండోసారి చేతులు కలిపి ఈ సిరీస్ తీస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో షూటింగ్ ముందుకు సాగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ కష్టాలు

రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి షూటింగ్ సెట్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెట్ నుంచి కనీసం రూ.2 నుంచి 3 కోట్లు దొంగిలించినట్లు తీవ్ర ఆరోపణలు రావడం గమనార్హం.

రక్త్ బ్రహ్మాండ్ ప్రొడక్షన్ ఆర్థిక లావాదేవీల విషయంలో తీవ్రమైన సమస్యలను గుర్తించినట్లు ఈ ప్రొడక్షన్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెప్టెంబర్ లోనే సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకూ కేవలం 26 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. కానీ ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది.

ఆడిట్‌తో మోసం బయటకు..

రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో ఆర్థిక అవకతవకలు ఓ ఆడిట్ ద్వారా బయటపడ్డాయి. ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, అకౌంటింగ్ అక్రమాలు బయటకు వచ్చాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయి.

అయితే ప్రొడక్షన్ లో ఎలాంటి ఆర్థిక అవకతవకలు జరిగాయన్నదానిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు. ఫిబ్రవరిలోనూ షూటింగ్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ అలా జరగలేదు. ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

స్క్రిప్ట్ సమస్యలు కూడా..

ఆర్థిక సమస్యలే కాదు.. ఈ రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కు స్క్రిప్ట్, క్రియేటివ్ ఇష్యూస్ కూడా వస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ ఫిల్మింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను మార్చేస్తున్నారు. ఇది నెట్‌ఫ్లిక్స్ కు నచ్చడం లేదు.

నిజానికి ఈ విషయంలో డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేకు నెట్‌ఫ్లిక్స్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ స్క్రిప్ట్ విషయంలో వీళ్లు కలిసి పని చేయలేకపోతున్నారు. ఈ సమస్యలు ఉన్నా కూడా ఏప్రిల్ నుంచి రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం