Netflix Web Series: కొత్త నెట్‌ఫ్లిక్స్ షో "అడోలెసెన్స్ (Adolescence)" సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఫిలిప్ బరాంటిని దర్శకత్వం వహించిన నాలుగు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ గత వారం మార్చి 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ షో ఎక్కువగా కొత్త నటీనటులతో, తక్కువ ప్రమోషన్‌తో వచ్చినా కూడా ఈ స్థాయి ఆదరణ దక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది మీ వాచ్ లిస్ట్‌లో ఎందుకు ఉండాలో చెప్పడానికి మూడు కారణాలను ఇక్కడ ఇస్తున్నాం.
ఈ అడోలెసెన్స్ వెబ్ సిరీస్ లో కేవలం నాలుగే ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ ఒక్కో ఎపిసోడ్‌ను ఒకే సింగిల్ టేక్ లో తీయడం అసలు విశేషం. కెమెరా ఎక్కువసేపు ఒకే చోట ఉండదు కాబట్టి వన్-షాట్ టెక్నిక్ నమ్మశక్యం కాదు. ఇది ఎలా సాధ్యమైందో సినిమాటోగ్రాఫర్ మాథ్యూ లూయిస్ వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
దీని కోసం చాలా ప్రిపరేషన్ జరిగిందని, ముఖ్యంగా రెండో ఎపిసోడ్‌లో యాక్షన్ స్కూల్‌లో జరుగుతుందని, అక్కడ వందకు పైగా పిల్లలు ఉన్నారు అని చెప్పారు. అది అంత సులువుగా అయ్యే పని కాదని వెల్లడించారు.
అటు డైరెక్టర్ ఫిలిప్ బరాంటిని కూడా నెట్‌ఫ్లిక్స్‌తో మాట్లాడాడు. "ఒక రకంగా చెప్పాలంటే.. మేము కెమెరాలో రికార్డ్ నొక్కుతాము. ఇక చివరి వరకు స్టాప్ నొక్కము. ఇది చెప్పినంత సులువు కాదు. స్క్రిప్ట్ నుండి లొకేషన్‌ల వరకు, ప్రొడక్షన్ డిజైన్ నుండి కెమెరా ఖచ్చితంగా ఎక్కడ షూట్ చేయగలదు.. ఏ కోణం నుండి షూట్ చేయగలదు అనే వరకు ప్రతి దశలోనూ దానిని పూర్తి చేయడానికి నెలల తరబడి ప్రిపరేషన్, వారాల తరబడి రిహార్సల్స్ అవసరం" అని బరాంటిని వెల్లడించాడు.
ఈ అడోలెసెన్స్ వెబ్ సిరీస్ ఓ 13 ఏళ్ల జేమీ మిల్లర్ అనే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తాను చదివే స్కూల్లో ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. ఆ హత్య కేసులో అతన్నే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతడు ఆ హత్య చేసిన విషయాన్ని తల్లిదండ్రులు నమ్మరు. పోలీసులు దీని వెనుక కారణాన్ని అన్వేషించే పనిలో పడతారు. ఒక్కో ఎపిసోడ్ ఒకే షాట్ లో ముందుకు సాగుతూ ఉంటుంది.
ఓ అద్భుతమైన యాక్షన్ తో మంచి థ్రిల్ పంచుతుంది. ఇందులో జేమీ మిల్లర్ పాత్రలో కొత్త నటుడు ఓవెన్ కూపర్ అద్భుతంగా నటించాడు. అతనితోపాటు ఇతర నటీనటులందరూ కలిసి ఈ వెబ్ సిరీస్ ను ఓ మస్ట్ వాచ్ గా మార్చేశారు. మన దేశ గొప్ప డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా మెచ్చిన సిరీస్ ఇది.
అడోలెసెన్స్ వెబ్ సిరీస్ అద్భుతమైన సాంకేతికత, నటనతోనే కాదు.. స్టోరీతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈతరం యువతలోని స్త్రీల పట్ల ద్వేషం, సోషల్ మీడియా ప్రభావం గురించి ఓ చర్చకు తెరలేపేలా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. పిల్లలు ఇంటర్నెట్ లో ఏం వెతుకుతున్నారు? వాళ్ల స్కూళ్లలో ఏం జరుగుతోంది? క్లాస్ రూమ్ వాతావరణం ఎలా ఉంటుంది?
పిల్లలను ప్రభావితం చేస్తున్న వాళ్లు ఎవరు? ఇలాంటి ప్రశ్నలను ఎన్నో ఈ అడోలెసెన్స్ వెబ్ సిరీస్ లేవనెత్తింది. ఇదే ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా దీనిని నిలుపుతోంది. కేవలం నాలుగే ఎపిసోడ్ల సిరీస్ కావడంతో ఈ వీకెండ్ బింజ్ వాచ్ చేసేయండి.
సంబంధిత కథనం