Netflix OTT: రూ.10 కోట్లు విలువైన క్లిప్‌ను ఫ్రీగా చూడండి.. ధనుష్‌పై కోపంతో వీడియోను వదిలిన నయనతార భర్త
Nayanthara Dhanush controversy: నయనతార, ధనుష్ మధ్య వివాదానికి కారణమైన వీడియో క్లిప్‌ను నయనతార భర్త విఘ్నేశ్ శివన్ సడన్‌గా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ వీడియో కోసం రూ.10 కోట్లని ధనుష్ డిమాండ్ చేయగా.. విఘ్నేశ్ ఫ్రీగా నెటిజన్లకి చూపించేశాడు.
లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. నయనతార బయోగ్రఫీ డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో సోమవారం (నవంబరు 18) నుంచి స్ట్రీమింగ్‌కానుంది. అయితే.. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ సినిమాలోని ఒక చిన్న క్లిప్ వాడారు. దాంతో ఆ క్లిప్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వాడినందుకు రూ.10 కోట్లు ఇవ్వాలంటూ నయనతారకి ధనుష్ నోటీసులు పంపారు.
అసలేంటి వివాదం?
ధనుష్ నోటీసులపై చిర్రెత్తిపోయిన నయనతార.. ఘాటుగా బహిరంగ లేఖని సోషల్ మీడియాలో విడుదల చేసింది. వ్యక్తిగత ద్వేషంతోనే తనపై ధనుష్ ఇలా కక్ష సాధింపులకి పాల్పడుతున్నట్లు ఆరోపించిన నయనతార.. చట్టపరంగానే ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేసింది.
2015లో విడుదలైన నేనూ రౌడీనే సినిమాలో.. విజయ్ సేతుపతికి జంటగా నయనతార నటించగా.. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చేసే సమయంలోనే విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార.. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది.
3 సెకన్ల క్లిప్‌కి రూ.10 కోట్లా?
ఆ సినిమా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ చాలా కీలకం కావడంతో డాక్యుమెంటరీలో ఆ సినిమాలో కొన్ని సీన్స్‌ను పెట్టాలని నయనతార ఆశించారు. అయితే.. ఆ సినిమా నిర్మాత అయిన ధనుష్ అందుకు అంగీకరించలేదు. నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు రెండేళ్లుగా నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ.. ఒక చిన్న షూటింగ్ క్లిప్‌ను వాడినట్లు డాక్యుమెంటరీ ట్రైలర్‌లో 3 సెకన్ల క్లిప్ కనిపించింది. వెంటనే ధనుష్ కాపీ రైట్ యాక్ట్ కింద రూ.10 కోట్లు కట్టాలని నోటీసులు పంపారు.
ఫ్రీగా చూడండి..
ధనుష్ నోటీసులపై నయనతార బహిరంగ లేఖతో స్పందించగా.. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఏకంగా ఆ డాక్యుమెంటరీలో వాడిన క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. రూ.10 కోట్లు విలువైన క్లిప్‌ను మీరు ఉచితంగా చూసేయండి అంటూ సుమారు 15 సెకన్లు ఉన్న వీడియోను విఘ్నేశ్ షేర్ చేశారు. దాంతో ఆ క్లిప్‌ను డాక్యుమెంటరీ నుంచి తొలగిస్తున్నట్లు తేలిపోయింది.
ధనుష్‌కి వ్యతిరేకంగా నయనతార రాసిన బహిరంగ లేఖకి లైక్ కొట్టి చాలా మంది హీరోయిన్స్ మద్దతుగా నిలిచారు. ఇందులో ధనుష్‌తో కలిసి నటించిన శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు కూడా ఉండటం గమనార్హం.