Happy Birthday Nayanthara: ఫ‌స్ట్ సినిమాతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల‌ని న‌య‌న‌తార అనుకుంది... కానీ-nayanthara birthday lesser known facts about nayanthara cinema career and personal life struggles ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nayanthara Birthday Lesser Known Facts About Nayanthara Cinema Career And Personal Life Struggles

Happy Birthday Nayanthara: ఫ‌స్ట్ సినిమాతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల‌ని న‌య‌న‌తార అనుకుంది... కానీ

Nelki Naresh Kumar HT Telugu
Nov 18, 2022 09:49 AM IST

Happy Birthday Nayanthara: లేడీ సూప‌ర్‌స్టార్‌గా ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో తిరుగులేని ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న‌ది న‌య‌న‌తార‌. ఆమె పుట్టిన‌రోజు నేడు. న‌య‌న‌తార‌ కెరీర్‌లోని కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఏవంటే...

న‌య‌న‌తార‌
న‌య‌న‌తార‌

Happy Birthday Nayanthara: సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోల‌దే అధిప‌త్యం. సినిమాల విజ‌యావ‌కాశాలు హీరోల ఇమేజ్‌, స్టార్‌డ‌మ్‌పైనే ఆధార‌ప‌డి ఉంటాయి. హీరోయిన్లు కేవ‌లం గ్లామ‌ర్‌కు మాత్ర‌మే ప‌రిమితం అనే సిద్ధాంతం బ‌లంగా పాతుకుపోయిన ఈ ఇండ‌స్ట్రీలో హీరోల‌తో స‌మానంగా పేరుప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్న క‌థానాయిక‌లు అరుదుగా క‌నిపిస్తుంటారు.

ఈ జ‌న‌రేష‌న్‌లో న‌య‌న‌తార అందుకు ఉదాహ‌ర‌ణగా నిలిచింది. లేడీ సూప‌ర్‌స్టార్ అనే బిరుదుతో ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. సినీ కెరీర్‌తో పాటు వ్య‌క్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మ‌విశ్వాసంతో వాటిని ఎదుర్కొంటూ అగ్ర‌నాయిక‌గా నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్‌కు ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో క్రేజ్‌ను, పూర్వ‌వైభ‌వాన్ని తీసుకొచ్చింది. న‌య‌న‌తార‌ సినిమాల‌కు స్టార్ హీరో రేంజ్‌లో ఓపెనింగ్స్ ఉంటాయంటే అతిశ‌యోక్తి కాదు.

కెరీర్ ఆరంభంలో రెండో హీరోయిన్‌గా

సినీ కెరీర్ ఆరంభంలో ఎక్కువ‌గా గ్లామ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లోనే క‌నిపించింది న‌య‌న‌తార‌. శ‌ర‌త్‌కుమార్ హీరోగా న‌టించిన అయ్యా సినిమాతో త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత ఈ సినిమాలో న‌య‌న్ హీరోయిన్ కాదు. న‌వ్య‌నాయ‌ర్ అనే మ‌రో నాయిక‌ను తీసుకున్నారు. కానీ అర్ధాంత‌రంగా ఆమె సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో న‌య‌న‌తార‌కు అవ‌కాశం వ‌చ్చింది.

గ‌జిని, చంద్ర‌ముఖితో పాటు ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా క‌నిపించింది. తొలి నాళ్ల‌లో అవ‌కాశాల ప‌రంగా న‌య‌న‌తార ప‌లు అవ‌మానాల్ని ఎదుర్కొన్న‌ది. గ‌జిని స‌మ‌యంలో న‌య‌న‌తార టాప్ హీరోయిన్ కాక‌పోవ‌డంతో ఆమె క్యారెక్ట‌ర్‌ను సినిమా నుంచి కావాల‌నే క‌ట్ చేశార‌ట‌. న‌టిగా ఆమెలోని ప్ర‌తిభ‌ను ఇవేవీ అడ్డుకోలేక‌పోయాయి.

యాంక‌ర్‌గా...

గ్రాడ్యుయేష‌న్ చ‌దివే రోజుల్లో ఓ టీవీ షోకు యాంక‌ర్‌గా ప‌నిచేసింది న‌య‌న‌తార‌. కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసింది. ఓ యాడ్‌లో ఆమెను చూసిన మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు స‌త్య‌న్ తాను రూపొందిస్తోన్న మ‌న‌సిక్క‌రే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దించాడు సినిమా లైఫ్ సెక్యూర్డ్ కాద‌నే అభిప్రాయంతో ఈ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించింది న‌య‌న‌తార‌. ద‌ర్శ‌కుడి బ‌ల‌వంతంతో ఒక్క సినిమా చేసి ఇండ‌స్ట్రీని వ‌దిలిపెట్టాల‌ని న‌య‌న‌తార అనుకున్న‌ది. ఫ‌స్ట్ సినిమా హిట్ కావ‌డంతో ఆమెకు గుడ్‌పై చెప్పే అవ‌కాశం రాలేదు.

వ్య‌క్తిగ‌త జీవితంలో అవ‌రోధాలు

న‌య‌న‌తార వ్య‌క్తిగ‌త జీవితం మొత్తం ఎన్నో ఆటుపోట్ల‌తో సాగింది. విఫ‌ల ప్రేమ బంధాల కార‌ణంగా ఒకానొక ద‌శ‌లో కెరీర్‌కు ముగిసిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ క‌ష్టాల‌ను దాటుకొని సూప‌ర్‌స్టార్‌గా ఎదిగింది. వ‌ల్ల‌వ‌న్ స‌మ‌యంలో కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమ‌లో ప‌డింది. కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో ఏడాది లోపే వీరు విడిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌భుదేవా, న‌య‌న‌తార ప్రేమాయ‌ణం రెండేళ్ల సాఫీగా పాటు సాగింది.

పెళ్లిపీట‌లెక్కే త‌రుణంలో అనివార్య కార‌ణాల వ‌ల్ల విడిపోయారు. ప్ర‌భుదేవాతో ప్రేమ విఫ‌లం కావ‌డంతో మూడేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైంది. రాజా రాణి సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది న‌య‌న‌తార‌. నానుమ్ రౌడీధాన్‌లో న‌టిస్తోన్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో న‌య‌న‌తార‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. నాలుగేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న ఈ జంట ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌లే స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. క‌వ‌ల పిల్ల‌ల వివాదం కూడా కోర్టు వ‌ర‌కు వెళ్లింది. కానీ న‌య‌న‌తార‌కు తీర్పు అనుకూలంగా వ‌చ్చింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌

ద‌క్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు న‌య‌న‌తార ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ జోన‌ర్‌కు తిరిగి పూర్వ వైభ‌వాన్ని తీసుకొచ్చింది న‌య‌న‌తార‌. ఆమె న‌టించిన మ‌యూరి, ఇమైక్కా నోడిగ‌ల్‌, నేట్రిక‌న్‌తో పాటు ప‌లు మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా అద్భుత విజ‌యాల్ని అందుకున్నాయి. ప్ర‌స్తుతం ఐదు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ సినిమాతో న‌య‌న‌తార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. షారుఖ్‌ఖాన్‌, ద‌ర్శ‌కుడు అట్లీ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన ఇర‌వై 20 త‌ర్వాత ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. గ‌త కొన్నేళ్లుగా సినిమా ప్ర‌మోష‌న్స్‌కు న‌య‌న‌తార దూరంగా ఉంటోంది. ఇంట‌ర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె క‌నిపించ‌దు. కెరీర్ ఆరంభంలో త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై వ‌చ్చిన క‌థ‌నాల వ‌ల్ల క‌ల‌త చెందిన న‌య‌న‌తార ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. ఇప్ప‌టికీ ఆ రూల్‌ను పాటిస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.