Nani Movies : ఇద్దరు సూపర్ స్టార్లతో నటించే ఛాన్స్ వస్తే నో చెప్పిన నాని
Natural Star Nani : భారతదేశంలోని ఇద్దరు సూపర్‌స్టార్‌లతో నటించే అవకాశాన్ని పక్కన పెట్టేశాడు నాని. వారితో నటించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ నాని మాత్రం అవకాశాన్ని వదులుకున్నాడు.
నాని(Actor Nani) తెలుగులో మంచి పేరున్న యాక్టర్. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ.. జనాలకు దగ్గరయ్యాడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నాని సినిమాలు ఎలా ఉన్నా.. అతడి యాక్టింగ్ చూసేందుకైనా జనాలు థియేటర్లకు వెళ్తారు. మాస్ సినిమాలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేస్తూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా అతడికి ఓ భారీ అవకాశం వచ్చిందని, ఆ అవకాశాన్ని నాని తిరస్కరించాడని అంటున్నారు.

భారతదేశంలోని ఇద్దరు సూపర్‌స్టార్‌లతో నటించే అవకాశం నానికి వచ్చింది కానీ దానిని తిరస్కరించారు. రజనీకాంత్(Rajinikanth), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటుడు నానికి ఓ ముఖ్య పాత్రని ఆఫర్ చేయగా, నాని అందుకు ఒప్పుకోలేదు.
రజనీకాంత్ 179వ చిత్రానికి దర్శకుడు టీజే జ్ఞానవేలు(TJ gnanavel) దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో నటి మంజు వారియర్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అదే సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం నటుడు నానిని దర్శకుడు టీజే జ్ఞానవేలు కోరగా అతడు నిరాకరించాడట. ఇది నాని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
తనను అడిగిన పాత్ర నెగెటివ్ షేడ్‌లో ఉండటంతో నాని ఆ పాత్రను తిరస్కరించినట్లు తెలుస్తోంది. నాని ఇప్పటి వరకు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించలేదు. ‘వి’ సినిమాలో కాస్త నెగెటివ్ షేడ్ లో నటించినా.. ఆ సినిమాకి అతనే హీరో. హీరోగా క్రేజ్ ఉన్నప్పుడు నెగెటివ్ రోల్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాత్రకు నటుడు శర్వానందను ఎంపిక చేసుకున్నాడట దర్శకుడు జ్ఞానవేలు.
సూర్య నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ జై భీమ్(Jai Bheem)కి టీజే జ్ఞానవేలు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం చాలా సంచలనం సృష్టించింది. చాలా చర్చకు దారితీసింది. కొన్ని సంఘాలు కూడా సినిమాకు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ఈ చిత్రం భారతదేశం నుండి ఆస్కార్ రేసుకు అధికారికంగా ఎంపికైంది. కానీ అక్కడ నిరాశే ఎదురైంది.
చివరగా నాని దసరా సినిమా(Dasara Cinema)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నాని తర్వాతి సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.