National Film Awards 2023: కాసేపట్లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
National Film Awards 2023: కాసేపట్లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ అవార్డుల సెర్మనీని ఎప్పుడు? ఎక్కడ చూడాలో తెలుసుకోండి. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, రాజమౌళిలాంటి వాళ్లు అవార్డులు అందుకోనున్నారు.
National Film Awards 2023: నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం (అక్టోబర్ 17) జరగబోతోంది. ఈ సెర్మనీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతుంది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లాడు. సోమవారం (అక్టోబర్ 16) అతన భార్య స్నేహతో కలిసి ఢిల్లీ వెళ్లాడు.
నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఒకటికి మించి అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తరఫున డైరెక్టర్ రాజమౌళితోపాటు కీరవాణిలాంటి వాళ్లు కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ సినిమా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అందజేస్తారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులంతా తరలి వచ్చారు.
నేషనల్ అవార్డ్స్.. ఎప్పుడు ఎక్కడ చూడాలి?
జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సెర్మనీని డీడీ నేషనల్ (DD National) ఛానెల్లో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ పై చూడాలనుకుంటే డీడీ నేషనల్ యూట్యూబ్ ఛానెల్ చూడొచ్చు. ఈ విషయాన్ని డీడీ నేషనల్ ఛానెల్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా వెల్లడించింది.
"69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగబోతోంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి డీడీ నేషనల్లో లైవ్ చూడండి" అని ట్వీట్ చేసింది. బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్, బెస్ట్ యాక్ట్రెస్ కృతి సనన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. పుష్ప మూవీకిగాను అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోగా.. మిమి సినిమాకుగాను ఉత్తమ నటిగా కృతి సనన్ నిలిచింది.
కృతితోపాటు గంగూబాయి కఠియావాడి మూవీకిగాను ఆలియా భట్ కూడా ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఆమె కూడా తన భర్త రణ్‌బీర్ తో కలిసి ముంబై నుంచి ఢిల్లీ వెళ్లింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటికి మించి అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాజమౌళితోపాటు ఇతర మూవీ టీమ్ ఈ అవార్డుల సెర్మనీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.