Telugu Indian Idol 3 OTT Winner: తెలుగు ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా మెకానిక్ కుమారుడు.. ఓజీ చిత్రంలోనూ పాడిన యంగ్ సింగర్-naseeruddin shaik becomes winner of aha ott singing show indian idol 3 and he sang a song in pawan kalyan og movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Indian Idol 3 Ott Winner: తెలుగు ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా మెకానిక్ కుమారుడు.. ఓజీ చిత్రంలోనూ పాడిన యంగ్ సింగర్

Telugu Indian Idol 3 OTT Winner: తెలుగు ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా మెకానిక్ కుమారుడు.. ఓజీ చిత్రంలోనూ పాడిన యంగ్ సింగర్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 21, 2024 09:43 PM IST

Telugu Indian Idol 3 OTT Winner Naseeruddin Shaik: తెలుగు ఇండియన్ ఐడల్ 3 ముగిసింది. రసవత్తరంగా జరిగిన ఫైనల్ తర్వాత విన్నర్ ఎవరో తేలింది. షేక్ నజీరుద్దీన్ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు.

Telugu Indian Idol 3 OTT Winner: తెలుగు ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా మెకానిక్ కుమారుడు.. ఓజీ చిత్రంలోనూ పాడిన యంగ్ సింగర్
Telugu Indian Idol 3 OTT Winner: తెలుగు ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా మెకానిక్ కుమారుడు.. ఓజీ చిత్రంలోనూ పాడిన యంగ్ సింగర్

ఆహా ఓటీటీలో సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్ 3వ సీజన్’ సక్సెస్‍ఫుల్‍గా ముగిసింది. గత రెండు సీజన్లలానే ఈ ఎడిషన్ కూడా ఆహాలో మంచి సక్సెస్ సాధించింది. ఈ మూడో సీజన్ గ్రాండ్ ఫైనలే నేడు (సెప్టెంబర్ 21) స్ట్రీమింగ్ అయింది. రసవత్తరంగా ఈ పాటల తుది సమరం జరిగింది. ఈ సీజన్ విజేతగా షేక్ నజీరుద్దీన్ నిలిచారు. టైటిల్, ప్రైజ్‍మనీ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలు ఇవే..

ఫైనలిస్టులు వీరే.. ప్రైజ్‍మనీ ఎంతంటే..

తెలుగు ఇండియన్ ఐడల్ 3లో షేక్ నజీరుద్దీన్, అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీకీర్తి ఫైనల్‍కు చేరారు. ఆ తర్వాత జరిగిన పోటీలో నజీరుద్దీన్, అనిరుధ్, శ్రీకీర్తి టాప్-3కి చేరారు.

టాప్-3 పోరు ముగ్గురి మధ్య హోరాహోరీగా సాగింది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన 19ఏళ్ల నజీరుద్దీన్ విజేతగా నిలిచారు. టైటిల్‍తో పాటు రూ.10లక్షల క్యాష్‍ప్రైజ్ దక్కించుకున్నారు. రన్నరప్‍గా రెండో స్థానంలో నిలిచిన అనిరుధ్‍కు రూ.3లక్షల ప్రైజ్‍మనీ సొంతమైంది. మూడో ప్లేస్ దక్కించుకున్న శ్రీకీర్తికి రూ.2లక్షలు అందుకున్నారు. జడ్జిలుగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు కార్తీక్, గీతా మాధురి.. టైటిల్ ప్రైజ్‍మనీ అందించారు.

మెకానిక్ కుమారుడిగా..

తెలుగు ఇండియన్ ఐడల్ 3వ సీజన్ విజేతగా నిలిచిన నజీరుద్దీన్‍ది ఆంధ్రప్రదేశ్‍లోని తాడేపల్లి గూడెం. ఆయన తండ్రి షేక్ బాజీ బైక్ మెకానిక్‍గా పని చేస్తుండేవారు. ఏడాది క్రితం ఆయన కన్నుమూశారు. సోదరి వహీదా రెహమాన్ అతడికి మద్దతుగా నిలిచారు.

నజీరుద్దీన్ ప్రస్తుతం సీఏ విద్యార్థిగా ఉన్నారు. చదువులో రాణిస్తూనే సంగీతం నేర్చుకున్నారు. కర్ణాటక సంగీత గురువు అయిన తన అమ్మమ్మ ఫాతిమా బీతో పాటు తాత ఖాసీమ్ సాహెబ్ ద్వారా సంగీతంపై అతడికి ఆసక్తి పెరిగింది. అప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు, తెలుగు ఇండియన్ ఐడల్ 3వ సీజన్ విజేతగా నిలిచారు.

ఓజీ సినిమాలో పాట

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంలో నజీరుద్దీన్ ఓ పాట పాడారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా ఓ ఎపిసోడ్‍లో వెల్లడించారు. నజీరుద్దీన్, భరత్ రాజ్ కలిసి ఓజీలో ఓ సాంగ్ పాడారని తెలిపారు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ టైటిల్ కూడా నజీర్ దక్కించుకున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ 3వ సీజన్ 28 ఎపిసోడ్లుగా సాగింది. ముందుగా 12 మంది కంటెస్టెంట్లు తలపడ్డారు. క్రమంగా ఎలిమినేట్ అవుతూ.. చివరికి ఐదుగురు కంటెస్టెంట్లు ఫైనల్ చేరారు. నజీరుద్దీన్, అనిరుధ్, శ్రీకీర్తి టాప్-3కి చేరారు. నజీరుద్దీన్ విజేతగా అయ్యారు.

తెలుగు ఇండియన్ ఐడల్ 3వ సీజన్ కూడా ఆహాలో మంచి వ్యూస్ దక్కించుకుంది. ప్రతీ శుక్రవారం, శనివారం కొత్త ఎపిసోడ్లు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. చాలా ఎపిసోడ్‍లు టాప్‍లో ట్రెండ్ అయ్యాయి. ఈ సీజన్‍లో నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి గెస్టులుగా వచ్చారు. అయితే, ఈసారి ఫైనల్‍కు ఎవరూ అతిథిగా రాలేదు.