AAY Movie TV Premiere: మూడు రోజుల్లో టీవీలోకి ‘ఆయ్’ మూవీ.. ఫ్యామిలీతో చూడదగిన ఈ సినిమా ఏ ఛానల్‌లోకి రానుందంటే?
AAY Movie In OTT: ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన ఆయ్ మూవీ.. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించి హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేసిన ఈ మూవీ.. మరో మూడు రోజుల్లో టీవీలోకి రానుంది.
కుటుంబంతో కలిసి సరదాగా చూడదగిన సినిమాలు ఈ ఏడాది చాలా తక్కువ వచ్చాయి. అందులో ఒకటి ఆయ్ మూవీ. స్నేహం నేపథ్యంలో పల్లెటూరిలో సాగే సరదా ప్రేమ కథ ఇది. నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ ఆయ్ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీల్లోనూ అదరగొట్టేసింది. ఇప్పుడు టీవీలోకి రాబోతోంది.
సినిమా కథ ఏంటంటే?
ఆయ్ సినిమా కథ గోదావరి నదిలోని పసలపుడిలంక నేపథ్యంలో సాగుతుంది. కార్తీక్ (నార్నే నితిన్), సుబ్బు (కసిరెడ్డి రాజ్కుమార్), హరి( అంకిత్ కొయ్య) చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన పల్లవి (నయని సారిక) అనే అమ్మాయిని కార్తీక్ ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ఇష్ట పడుతుంది. కానీ.. ఆ అమ్మాయిని సుబ్బు కూడా ప్రేమిస్తాడు. మధ్యలో కులం పట్టింపులు రావడంతో పల్లవి ఎవరిని ప్రేమిస్తుంది? వారికి ఎదురైన అడ్డంకులను ఎలా పరిష్కరించారు? అనేది ఈ సినిమా కథ.
కులం కంటే స్నేహం గొప్పది
కులం కంటే స్నేహం గొప్పదని క్లైమాక్స్‌లో చాటిచెప్పే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. మనిషి కష్టాల్లో ఉన్నా.. కులం చూస్తున్నారు తప్ప.. సాటి మనిషికి సాయం చేయడం లేదనే విషయాన్ని ఆయ్ ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వరకూ ఒక ట్విస్ట్‌ను రివీల్ చేయకుండా సస్పెన్స్‌గా ఉంచడంలో దర్శకుడు సఫలం అయ్యారు. ఆ ట్విస్ట్‌తో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు.
అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఆయ్ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రిలీజై ఫ్యామిలీ ఆడియోన్స్‌తో పాటు యూత్‌ని ఆకట్టుకుంది. సినిమాలో లవ్, ఫ్రెండ్స్ మధ్య వెటకారం, కామెడీ ట్రాక్ కడుపుబ్బా అందర్నీ నవ్విస్తుంది. సినిమాలో ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించిన ఆయ్ సినిమాని ఈ ఆదివారం జీ తెలుగు వేదికలో టెలికాస్ట్‌కానుంది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఆయ్ ఈ ఆదివారం (నవంబరు 17) మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో ప్రసారంకానుంది.
ఐఎండీబీలో 6.4 రేటింగ్
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించిన ఆయ్ సినిమాకి ఐఎండీబీలో 10కి గానూ 6.4 రేటింగ్ వచ్చింది. అలానే యూజర్స్ కూడా చాలా పాజిటివ్‌గా ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు.