Chandrababu Biopic: ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన చంద్రబాబు బయోపిక్ తెలుగోడు.. మంచి రెస్పాన్స్-nara chandrababu naidu biopic telugodu movie released on youtube and gets good response ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandrababu Biopic: ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన చంద్రబాబు బయోపిక్ తెలుగోడు.. మంచి రెస్పాన్స్

Chandrababu Biopic: ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన చంద్రబాబు బయోపిక్ తెలుగోడు.. మంచి రెస్పాన్స్

Sanjiv Kumar HT Telugu
May 10, 2024 06:26 AM IST

Chandrababu Biopic Telugodu Movie In Youtube: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా తెలుగోడు. ఏ ఓటీటీల్లో కాకుండా సైలెంట్‌గా యూట్యూబ్‌లో రిలీజైన తెలుగోడు సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన చంద్రబాబు బయోపిక్ తెలుగోడు.. మంచి రెస్పాన్స్
ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన చంద్రబాబు బయోపిక్ తెలుగోడు.. మంచి రెస్పాన్స్

Chandrababu Biopic Telugodu Youtube Response: తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయనొక విజనరీ. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావి తరాల భవిష్యత్తుకు వేసిన బాటలు చరిత్ర. తెలుగు జాతి ఉన్నతికి కృషి చేసిన ఆయన జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కింది.

నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ మూవీ 'తెలుగోడు'. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఉపశీర్షిక. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు.

యూట్యూబ్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. ఎలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయకుండా ఎన్నికల వేల సైలెంట్‌గా యూట్యూబ్‌లో తెలుగోడు సినిమాను రిలీజ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటీటీలో అయితే సినిమా చూసేందుకు సబ్‌స్క్రిప్షన్ వంటివి కావాలి. అదే యూట్యూబ్‌లో అయితే ఎవరికైనా ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఈ కారణంతోనే అందరికీ సినిమా రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో నేరుగా యూట్యూబ్‌లో సినిమాను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.

గురువారం (మే 9) ఉదయం విడుదలైన ఈ తెలుగోడు సినిమా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని.. తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్ తీసి ప్రశంసలు అందుకుంటున్నారు.

''చంద్రబాబు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు'' అని దర్శకుడు వెంకీ మేడసాని అన్నారు.

''చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా'' అని డైరెక్టర్ వెంకీ మేడసాని తెలిపారు.

''అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం మీద నేను సినిమా తీశాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించారు? అనేది 'తెలుగోడు' కాన్సెప్ట్. ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా'' అని వెంకీ మేడసాని చెప్పుకొచ్చారు.

''ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిశా. కొందరు పెద్దలనూ కలిశా. రాజకీయ నాయకుడి సినిమా సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్ నచ్చి సినిమా తీశా. చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశాం. కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్ రిలీజ్ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది'' అని వెంకీ మేడసాని వివరించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో వినోద్ నటించారు. ఈ 'తెలుగోడు' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మల్లిక్ చంద్ర వర్క్ చేయగా రాజేష్ రాజ్ సంగీతం అందించారు. కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - ప్రొడ్యూసర్ - డైరెక్టర్ అన్ని బాధ్యతలను డాక్టర్ వెంకీ మేడసాని చేపట్టారు.

IPL_Entry_Point