Meet cute Web series Review: మీట్ క్యూట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?
Meet cute Webseries Reveiw: నాని నిర్మాతగా వ్యవహరించిన మీట్ క్యూట్ వెబ్‌సిరీస్ సోనీ లివ్ వేదికగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఐదు విభిన్న కథల ఈ ఆంథాలజీ సిరీస్‌లో వర్ష బొల్లమ్మ, రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్, సత్యరాజ్, రోహిణి, అదా శర్మ తదితరులు నటించారు.
Meet cute Web series Review: నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా సంస్థలో నిర్మించిన సిరీస్ మీట్ క్యూట్. కంటెంట్ ఉన్న ప్రాజెక్టులను నిర్మిస్తూ నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు నాని. ఇందులో భాగంగా తన సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో మీట్ క్యూట్ సిరీస్‌ను నిర్మించారు. ఐదు విభిన్న కథల ఆధారంగా తెరకెక్కిన ఈ ఆంథాలజీ సిరీస్ సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తంగా ఐదు కథలు ఉన్నాయి. ఈ కథలను రాసింది కూడా దీప్తినే. ఈ ఐదు కథలు ప్రేక్షకులను అలరించాయా? దర్శకురాలిగా దీప్తి ఏ మేరకు సక్సెస్ అయ్యారు. లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
మీట్ ది బాయ్..
స్వాతి(వర్ష బొల్లమ్మ) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చూపులకు ఒప్పుకుంటుంది. అప్పటికే పది సంబంధాలు రిజక్ట్ చేసిన స్వాతి.. పెళ్లి చూపులంటే అయిష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓ కంపెనీలో కన్సెల్టెంట్‌గా పనిచేస్తున్న అభి(అశ్విన్)తో పెళ్లిచూపులకు సిద్ధమవుతుంది స్వాతి. ఇందుకోసం ఓ రెస్టారెంట్‌లో మీట్ అవుతారు. వీరిద్దరి పరిచయంలో ఎలాంటి మాటలు సాగాయి? పెళ్లికి స్వాతి ఓకే చెప్పిందా? తన లైఫ్ పార్టనర్ నుంచి స్వాతి ఎలాంటి గుణాలు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? అనేది మిగిలిన చిత్ర కథాంశం.
తన భాగస్వామి నుంచి ప్రేమ, గౌరవం, సంతోషం కోరుకునే ఓ ఇండిపెండెంట్ అమ్మాయి కథ. మోడ్రన్ గానే ఉంటూ.. మెచ్యూరిటీగానూ వ్యవహరించే స్వాతి క్యారెక్టర్ నేటి యువ మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. అలాగే అభి పాత్ర సింపుల్, నిలకడగా ఉంటుంది. నేటి యువతో ఈ లక్షణం అరుదనే చెప్పాలి. పెళ్లి చూపులు ఇద్దరం కలవడం, మాట్లాడుకోవడం, ఆ మాటాల్లోనే ఒకరినొకరు అర్థం చేసుకుని నవ్వుకోవడం తప్పితే కొత్తదనమైతే ఉండదు. అలా అని బోరింగ్‌గానూ అనిపించదు. నిలకడగా సాగిపోతుంది.
ఓల్డ్ ఈజ్ గోల్డ్..
సరోజ(రుహాని శర్మ). జై(రాజా) భార్య, భర్తలు. సరోజ తన స్నేహితులతో కలిసి పారిస్ ట్రిప్‌నకు వెళ్లాలని ఫిక్స్ అవుతుంది. కానీ వెకేషన్ జైకి ఇష్టం ఉండదు. అలా అని వెళ్లొద్దని కూడా గట్టిగా చెప్పడు. చిరాకు పడుతూ ముభావంగా ఉంటూ తన బాధను వ్యక్తం చేస్తుంటాడు. ఇదే సయమంలో తన భార్య కోసం స్విట్జర్లాండ్ ప్లాన్ చేసిన మోహనరావు(సత్యరాజ్) యూరప్ కాన్సోలెట్‌కు వస్తారు. సరోజ.. మోహనరావు అక్కడ కలుసుకుంటారు. వారి మాటల మధ్య రాజ టాపిక్ రావడం, కుటుంబంలో రిలేషన్స్ ఎలా ప్రవస్తిస్తుంటారు, గొడవలు, కలహాలు, అనురాగాల ప్రస్తావన జరుగుతుంది. మోహనరావుతో ఆ మాటల పరిచయం సరోజ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ స్టోరీ.
మొదటి ఎపిసోడతో పోలిస్తే ఈ స్టోరీ బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా సత్యరాజ్ నటన ఈ ఎపిసోడ్‌కు హైలెట్‌గా ఉంటుంది. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఈ స్టోరీకి అదనంపు ఆకర్షణగా నిలిచాయి. రుహానీ, జైల మధ్య సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. అయితే వీరి మధ్య బంధం గురించి ఇంకాస్త్ చూపిస్తే బాగుంటుందనిపిస్తుంది.
ఇన్ లా..
పూజా(ఆకాంక్ష సింగ్), సిద్ధార్థ్(దీక్షిత్ శెట్టి) ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. సిద్ధూ, పూజ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసిన సిద్ధూ తల్లి పద్మ(రోహిణి) ఆశ్చర్యపోతుంది. అయినప్పటికీ పూజా ఎలాంటిదో తెలుసుకోవాలని భావించి ఆమెతో పరిచయం లేని వ్యక్తిగా కలుస్తుంది. సిద్ధూతో ఆమెకున్న రిలేషన్ గురించి తెలుసుకుంటుంది. అంతేకాకుండా పూజాకు ఇదివరకే వివాహమైందని తెలుసుకుంటుంది. మరి నిజం తెలుసుకున్న పద్మ ఎలా రియాక్ట్ అయింది? పూజా విడాకులకు కారణం? సిద్ధూతో ఆమెకు రిలేషన్ ఎలా ఉంది? లాంటివి మిగిలిన కథాంశం.
ఈ సిరీస్‌లో కాస్త స్టోరీ బేస్డ్ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఓ సినిమా తీసేంత నిడివి ఉన్న ఈ స్టోరీని కేవలం ఎపిసోడ్‌తోనే సరిపెట్టేస్తారు. రిలేషన్‌లో ఉంటూ కూడా ఒంటరితనాన్ని అనుభవించే అమ్మాయి గురించి ఎక్కువ చూపించవచ్చు. ఇదే సమయంలో తన కుమారుడు ప్రేమిస్తున్న అమ్మాయి గురించి తెలుసుకోవడానికి కేవలం మాటలతో సరిపెట్టడం, కొంత సమయంలోనే ఓ అంచనాకు రావడం లాంటివన్నింటీని కేవలం అరగంటలోనే చూపించడం త్వరితగతంగా ముగించారనిపిస్తుంది. నటీనటుల విషయానికొస్తే పూజా పాత్రలో ఆకాక్షం సింగ్ ఒదిగిపోయింది. సిద్ధార్థ్ పాత్రలో దీక్షిత్ శెట్టి ఫర్వాలేదనిపిస్తాడు. రోహిణి తనకు నప్పే అమ్మ పాత్రలో జీవించింది.
స్టార్స్ టాక్..
ఈ సిరీస్‌లో వచ్చిన మరో ఎపిసోడ్ స్టార్స్ టాక్. పేరుగాంచిన ఓ హీరోయిన్‍కు తనెవరో తెలియని ఓ డాక్టర్ పరిచయమైతే.. వారి మధ్య ఎలాంటి సంభాషణలు ఉంటాయి? హీరోయిన్ తన పాపులారిటీని పక్కన పెట్టి ఎలా నడుచుకుంది లాంటివి మిగతా కథాంశం. హీరోయిన్ శాలిని పాత్రలో అదా శర్మ చేయగా.. డాక్టర్ అమన్ పాత్రలో శివ కందుకూరి నటిస్తాడు. ఓ వర్షం కురుస్తున్న రాత్రి శాలిని ప్రయాణిస్తున్న కారు బ్రేక్ డౌన్ కావడంతో ఆమెకు డాక్టర్ అమన్ లిఫ్ట్ ఇస్తాడు. వర్షంలో ప్రయాణం కష్టమవుతుందని చెప్పి తన ఆపార్ట్మెంట్‌కు ఆహ్వానిస్తాడు. అమన్ ఇల్లు చూసి ఇంప్రెస్ అయిన శాలిని.. అతడితో మాట కలుపుతుంది. వీరిద్దరూ అభిరుచులు పంచుకుంటారు. మరి జీవితంలో వీరికి ఏం కావాలి? ఎలాంటి సహచర్యం కోరుకుంటారు? లాంటిది మిగిలిన కథాంశం.
ఓ స్టార్ హీరోయిన్ కూడా సాధారణ అమ్మాయే అని, తనకీ మాములు జీవితం గడపాలని ఉంటుందని, కానీ ఇమేజ్ చట్రం వల్ల అలా ఉండటం కుదరదనే అందరికీ తెలిసిందే. అయితే తనెవరో తెలియని ఓ వ్యక్తి కలిసినప్పుడు ఎంత సహజంగా ఉండాలని కోరుకుంటుందనే కోణాన్ని ఇందులో చూపించారు. ఈ ఎపిసోడ్‌లోనూ మాటలు తప్పా.. స్క్రీన్ ప్లేకు పెద్దగా చోటుండదు. ఆ డైలాగులు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండవు. అదా శర్మ, శివ కందుకూరి నటన మాత్రం ఫర్వాలేదనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు.
ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్..
అంజన(సంచిత), అజయ్(గోవింద్ పద్మసూర్య ఇద్దరూ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. పెళ్లయిన తర్వాత కూడా అంజనాకు అజయ్ మధ్య మాటలు పెద్దగా ఉండవు. తన భర్త గురించి అంజనాకు ఏం తెలియదు. తామిద్దరం వేరు వేరు ప్రపంచాలకు చెందినవారమని అంచనా అనుకుంటుంది. ఓ దశలో విడిపోవాలని కూడా నిర్ణయించుకుంటుంది. ఇలాంటి సమయంలో అంచనాకు పరిచయమైన కిరణ్.. అజయ్ గురించి ఆసక్తికర విషయాలను తెలియజేస్తుంది. ఆమె అజయ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌నని చెబుతుంది. మరి కిరణ్ అంచనాతో ఏం చెప్పింది? అజయ్-కిరణ్ ఎందుకు విడిపోయారు? అజయ్ ముభావంగా ఉండటానికి కారణం ఏంటి? అనేది మిగిలిన కథాంశం.
ఈ ప్లాట్‌లో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. కిరణ్ ఎవరో ఆడియెన్స్‌కు ముందుగానే తెలిసిపోతుంది. దీనికి చివర్లో పెద్ద ట్విస్ట్ మాదిరిగా చూపించడం ప్రేక్షకులకు పెద్దగా రుచించదు. అంతేకాకుండా కిరణ్, అంజనా మధ్య వచ్చే డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉండవు. కిరణ్, అజయ్ మధ్య సంభాషణ మొదలైనప్పుడే.. కథంతా తెలిసిపోతుంది. కథనం కూడా ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల ఈ డైలాగులు బోరింగ్‌గా అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం..
ఈ ఆంథాలజీ సిరీస్‌లో వచ్చిన ఐదు కథల నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అన్నీ అర్బన్ సొసైటిలో జరిగే కథలే కావడం వల్ల మాస్ ప్రియులకు ఈ సిరీస్ పెద్దగా రుచించకపోవచ్చు. ఏదైనా ఒకటి రూరల్ ప్రజలను రిలేట్ చేసేలా ఉండుంటే బాగుండేది. వెబ్ సిరీస్‌లు ఈ మధ్య కాలంలో చాలా వరకు ఆకట్టుకోలేకపోడానికి ప్రధాన కారణం కథ, కథనాలే. కొన్నిసార్లు స్టోరీ లైన్ బాగున్నప్పటికీ దాన్ని ఆసక్తిగా చెప్పడంలో విఫలం కావడం వల్ల వెబ్‌సిరీస్‌లు మెప్పించలేకపోతున్నాయి. ఇందుకు మీట్ క్యూట్ మినహాయింపేమి కాదు. ఈ సిరీస్‌లో ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇన్ లా మినహా మిగిలినవి పెద్దగా ఆకట్టుకోవు. ఆ రెండు ఎపిసోడ్‌లు కూడా నటీ, నటులు ప్రదర్శన, కథ కారణంగా ఓ మేరకు మెప్పిస్తాయి.
మీట్ క్యూట్ టైటిల్‌కు తగినట్లు ఇరువురి అపరిచితుల మధ్య సంభాషణలు ఆసక్తికరంగా ఉండాలి. అసలు కానీ.. ఏం చెబుతున్నారో తెలియని విధంగా, టైం పాస్ మాటల మాదిరిగా ఉండకూడదు. ఈ సిరీస్‌లో పదునైన సంభాషణలు లేకపోవడం మైనస్. ఎన్నో మాటలు వచ్చినప్పటికీ ఒక్కటి కూడా గుర్తుండేలా ఉండదు. సాంకేతిక నిపుణుల వద్దకు వస్తే విజయ్ నేపథ్య సంగీంతం, వసంత్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. చాలా వరకు ఇంగ్లీష్‌నే డైరెక్ట్‌గా ఉపయోగించడం వల్ల నేటివిటీ లోపించినట్లయింది. ఏదో ఇతర భాషలకు చెందిన సిరీస్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా చెప్పకపోవడం ఇందులో ప్రధాన సమస్య. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇన్‌లా ఎపిసోడ్‌లు ఆకట్టుకుంటాయి.
చివరగా.. మీటింగ్ క్యూట్ ఉన్నా.. మాటల్లోనే మ్యాటర్ లేదు
రేటింగ్.. 2.5/5
సంబంధిత కథనం
Intinti Ramayanam Teaser: నవ్వించే ఇంటింటి రామాయణం.. టీజర్ రిలీజ్
November 25 2022