Nani on Priyadarshi: అతడు టాలీవుడ్ ఆమిర్ ఖాన్: యువ హీరోపై నాని ప్రశంసలు
Nani on Priyadarshi: టాలీవుడ్ ఆమిర్ ఖాన్ అంటూ యువ హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించాడు నేచురల్ స్టార్ నాని. అతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 35 చిన్న కథ కాదు ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన అతడు.. దర్శితోపాటు మూవీని కూడా ఆకాశానికెత్తేశాడు.
Nani on Priyadarshi: ఆమిర్ ఖాన్ కు మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ అతడు ఎంచుకున్న పాత్రలుగానీ, నటనపరంగా గానీ ఆమిర్ ప్రత్యేకంగా నిలుస్తాడు. అలాంటి ఆమిర్ ఖాన్ తెలుగులో ప్రియదర్శియే అని నేచురల్ స్టార్ నాని అన్నాడు. దర్శి నటించిన లేటెస్ట్ మూవీ 35 చిన్న కథ కాదు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు నాని హాజరయ్యాడు.
ప్రియదర్శి టాలీవుడ్ ఆమిర్ ఖాన్
విలక్షణ నటన, కామెడీనే కాదు ఎలాంటి భావోద్వేగాన్ని అయినా పండించే నటుడు ప్రియదర్శి. అతడు నటించిన మూవీ 35 చిన్న కథ కాదు. ఈ సినిమా వచ్చే శనివారం (సెప్టెంబర్ 7) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్ కు నాని గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా అతడు దర్శిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
"పర్ఫార్మెన్స్ పరంగా, కంటెంట్ పరంగా దర్శిలో ఓ ప్రత్యేకమైన కాంబినేషన్ ఉంది. తను ఎంచుకునే రోల్ గానీ, ఆ పాత్రను అప్రోచ్ అయ్యే విధానంగానీ బాగుంటాయి. ఈ సినిమాలో టీచర్ పాత్రలో బాగా చేశాడు. ప్రతి దాంట్లోనూ పర్ఫెక్షన్ కోసం చూస్తుంటాడు.
ఓ సినిమాలో హీరోగా కనిపిస్తాడు. మరోదాంట్లో సైడ్ క్యారెక్టర్ చేస్తుంటాడు. అతన్ని చూస్తుంటే టాలీవుడ్ ఆమిర్ ఖాన్ అనిపిస్తుంది. ఒకవేళ అతడు టాలీవుడ్ ఆమిర్ ఖాన్ అయితే ఈ 35 మూవీ అతని తారే జమీన్ పర్ అవుతుంది" అని నాని చెప్పగానే వెనుక ఉన్న ప్రియదర్శి ఆశ్చర్యపోయాడు.
35.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా
ఇక 35 చిన్న కథ కాదు మూవీ గురించి కూడా నాని చాలా గొప్పగా చెప్పాడు. ఇది ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అని, సరిపోదా శనివారంలాంటి సినిమాలు కూడా తరచూ వస్తుంటాయేమోగానీ ఈ 35లాంటివి రావు అని నాని అనడం గమనార్హం.
"నేను సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో చూసిన అందమైన తెలుగు సినిమాల్లో ఒకటి 35. ఇది యూత్ కు ఎక్కుతుందా లేక వాళ్లకా వీళ్లకా అని చెప్పను. ప్రతి ఒక్క అమ్మ, నాన్న తమ పిల్లలను తీసుకొని వెళ్లి చూడాల్సిన సినిమా. ఇంతకుముందు నివి చెప్పినట్లు.. ఒక రోజు స్కూల్ మిస్ అయినా ఫర్వాలేదు. ఒక రోజు స్కూలుకు వెళ్లకపోయినా ఆ రోజు స్కూల్లో నేర్చుకునేదాని కంటే థియేటర్లో ఎక్కువగా నేర్చుకుంటారు" అని నాని అన్నాడు.
35 చిన్న కథ కాదు మూవీ గురించి..
35 చిన్న కథ కాదు.. సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులను మేకర్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమా వచ్చే శనివారం (సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చాణక్య వర్మ అనే మ్యాథ్స్ టీచర్ పాత్రలో ప్రియదర్శి కనిపించాడు. ఈ సినిమా కొన్ని ప్రీమియర్ షోలు ఇప్పటికే స్క్రీనింగ్ చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
పెయిడ్ ప్రీమియర్లు కూడా వేయనున్నారు. తాజాగా సుహాస్ నటించిన జనక అయితే గనక మూవీ రిలీజ్ వాయిదా పడటంతో అది ఈ 35 మూవీకి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. నంద కిశోర్ ఈమని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నివేదా థామస్, విశ్వదేశ్ రాచకొండ, గౌతమి, భాగ్యరాజ్ లాంటి వాళ్లు నటించారు.