Nandamuri Mokshagna Teja: బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్ర మూవీ ఎప్పుడు మొదలుకానుందో చెప్పిన నిర్మాత
Nandamuri Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తొలి మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందోననే నిరీక్షణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుపై కొన్ని రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ కొన్ని విషయాలు చెప్పారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హనుమాన్ మూవీతో గతేడాది బ్లాక్‍బస్టర్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి చిత్రం ఉండనుంది. ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే, గతేడాదిలోనే షూటింగ్ మొదలవుతుందని సమాచారం రాగా.. ఆలస్యమైంది. దీంతో చాలా రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా అప్‍డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. షూటింగ్ ప్రారంభం గురించి చెప్పారు.
భారీస్థాయిలో..
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నాగవంశీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్ర మూవీ గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన స్పందించారు.
మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ చిత్రం గ్రాండ్ వీఎఫ్‍ఎక్స్‌తో ఉంటుందని నాగవంశీ తెలిపారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో రూపొందించనున్నారని చెప్పారు. “హనుమాన్ తర్వాత కావడంతో ప్రశాంత్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా బాగా ల్యాండ్ చేస్తాడని నాకు చాలా నమ్మకం. ఇది చాలా పెద్ద సినిమా” అని నాగవంశీ అన్నారు.
షూటింగ్ మొదయ్యేది అప్పుడే
మోక్షజ్ఞ - ప్రశాంత్ మూవీ షూటింగ్ ఆలస్యం గురించి కూడా నాగవంశీ చెప్పారు. సంక్రాంతికి మొదలుకావాల్సింది వాయిదా పడిందనేలా మాట్లాడారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదవుతుందని చెప్పారు. పెద్దగా లేట్ కావడం లేదని అన్నారు.
ఈ సినిమా షూటింగ్ గతేడాది సెప్టెంబర్‌లోనే మొదలవుతుందని సమాచారం వచ్చింది. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశారట. అయితే సడన్‍గా వాయిదా పడింది. దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే రూమర్లు కూడా వచ్చాయి. అలాంటిదేమీ లేదని, మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ మూవీ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరితో పాటు బాలయ్య కూతురు నందమూరి తేజస్విని కూడా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోక్షజ్ఞను సూపర్ హీరోగా ప్రశాంత్ వర్మ చూపించనున్నారని రూమర్లు ఉన్నాయి.
మోక్షజ్ఞ మూవీ గురించి నాగవంశీ అప్‍డేట్ చెప్పటంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం సుమారు రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో రూపొందనుందని తెలుస్తోంది.
డాకు మహారాజ్ గురించి..
బాబీ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే వారం జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు.