Padma Bhushan for Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.. బాల బాబాయ్ అంటూ ఎన్టీఆర్ అభినందనలు
Padma Bhushan for Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
తెలుగు సీనియర్ స్టార్ హీరో, నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ఆయనకు లభించింది . 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను భారత ప్రభుత్వం నేడు (జనవరి 25) ప్రకటించింది. సినీ హీరో, హిందుపురం ఎమ్మెల్యే అయిన బాలయ్యకు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పురస్కారం కైవసం అయింది.
కళారంగానికి గాను..
కళారంగంలో ఆయన చేసిన భాగస్వామ్యానికి గాను బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ నుంచి పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. తెలుగు సినిమా రంగంలో స్టార్ నటుడిగా దశాబ్దాలు కొనసాగుతున్నారు బాలయ్య. తెలుగు ఇండస్ట్రీకి ఆయన భాగస్వామ్యానికి అవార్డు దక్కింది.
కాగా, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ 2014 నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలిచారు బాలయ్య.
బాల బాబాయికి అంటూ..
పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్న తన బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు తెలిపారు స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. “ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు గౌరవం దక్కించుకున్న బాల బాబాయ్‍కి హృదయపూర్వక శుభాకాంక్షలు. సినీ రంగానికి, ప్రజాసేవకు మీరు చేసిన ఎనలేని సేవలకు దక్కిన గుర్తింపు ఇది” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
అజిత్, శోభనకు కూడా..
తమిళ సీనియర్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు కూడా పద్మభూషణ్ అవార్డు దక్కింది. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కళా రంగానికి ఆయన భాగస్వామ్యానికి అవార్డును కేంద్రం ప్రకటించింది. సీనియర్ నటి శోభనకు కూడా పద్మభూషణ్ పురస్కారం దక్కింది. బాలీవుడ్ నటుడు శేఖర్ కపూర్ కూడా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.
కేంద్ర ప్రభుత్వం మొత్తంగా నేడు 139 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, ఏడు పద్మవిభూషణ్ పురస్కారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు దక్కింది. తెలంగాణ నుంచి వైద్య రంగానికి గాను డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావును పద్మభూషణ్ వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగంలో మాడుగుల శేషఫణి శర్మ, మిరియాల అప్పారావులకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా రూ.130కోట్లకు పైగా కలెక్షన్లతో హిట్ సాధించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తదుపరి అఖండ 2 సినిమా చేయనున్నారు బాలయ్య.
సంబంధిత కథనం