విలక్షణ నటుడు కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు పలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ కేటగిరీలో ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. కానీ తుది జాబితాలో ఈ మూవీకి చోటు దక్కలేదు. బెస్ట్ యాక్టర్‌గా ఈ మూవీకి గాను కమల్ హాసన్ నేషనల్ అవార్డును అందుకున్నాడు. మరో రెండు కేటగిరీలలో ఈ మూవీ జాతీయ పురస్కారాలను దక్కించుకున్నది.
పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అరవై ఐదు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అయితే భారతీయుడు సినిమాలో హీరోగా కమల్‌హాసన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. రజనీకాంత్‌ను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ శంకర్ ఈ కథను రాసుకున్నాడట. ప్రేమికుడు తర్వాత రజనీకాంత్‌తో సినిమా చేయాలని శంకర్ అనుకున్నారు. పెరియమానుషన్ పేరుతో రజనీకాంత్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని డ్యూయల్ రోల్‌తో బౌండెడ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారు. ఆ టైమ్‌లో రజనీకాంత్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో భారతీయుడు కథతో కమల్‌హాసన్ సంప్రదించారట శంకర్.
కథానుగుణంగా ఈ సినిమాలో హీరో డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. అదీ కూడా వృద్ధుడి పాత్ర చేయాల్సి వుండటంతో కమల్‌హాసన్ అంగీకరిస్తారో లేదోనని శంకర్ అనుకున్నారు. ఒకవేళ కమల్‌హాసన్ గనుక ఈ సినిమాను రిజెక్ట్ చేస్తే తెలుగు హీరోలతో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశారు.
యంగ్ హీరో రోల్ కోసం నాగార్జున, వెంకటేష్‌లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారట. సేనాపతి పాత్ర కోసం మరో టాలీవుడ్ హీరో రాజశేఖర్ పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా శంకర్ భావించారట. కానీ కమల్‌హాసన్ భారతీయుడు సినిమా చేయడానికి అంగీకరించడంతో ముగ్గురు తెలుగు హీరోలు ఈ సూపర్ హిట్ మూవీలో నటించే ఛాన్స్ కోల్పోయారు. ఈ విషయాన్ని శంకర్ అసిస్టెంట్ వసంతపాలన్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు 2 మూవీని తెరకెక్కించాడు శంకర్. గత ఏడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అందులో సగం కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. భారతీయుడు 2 కు కొనసాగింపుగా భారతీయుడు 3 కూడా రాబోతోంది. భారతీయుడు 3 డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం