Nagarjuna Sorry: అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. ఆ వీడియో వైరల్ అవడంతో మళ్లీ అలా జరగదంటూ..
Nagarjuna Sorry: కింగ్ నాగార్జున ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. ముంబై ఎయిర్ పోర్టులో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అతడు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా సారీ చెప్పడం గమనార్హం.
Nagarjuna Sorry: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఆదివారం (జూన్ 23) తన సోషల్ మీడియా ద్వారా ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. ఇలా మళ్లీ జరగదంటూ హామీ ఇచ్చాడు. ముంబై ఎయిర్ పోర్టులో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నాగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో నాగార్జున ఓ ట్వీట్ చేశాడు.
నాగార్జున క్షమాపణ
అక్కినేని నాగార్జున ఆదివారం (జూన్ 23) రాత్రి చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. అందులో కింగ్ ఓ అభిమానికి క్షమాపణ చెప్పడం గమనార్హం. "ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది.. అలా జరగాల్సింది కాదు. ఆ వ్యక్తిని నేను క్షమాపణ అడుగుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను" అని నాగార్జున ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అంతకుముందు వైరల్ అయిన వీడియోను కూడా జత చేశాడు.
అసలేం జరిగిందంటే?
నాగార్జున కుబేర మూవీ షూటింగ్ కోసం ధనుష్ తో కలిసి ముంబై వెళ్లాడు. ముంబై ఎయిర్ పోర్టులో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఓ అభిమాని.. అతనితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. దీంతో పక్కనే ఉన్న నాగార్జున సెక్యూరిటీ గార్డు ఆ అభిమానిని ఈడ్చి పారేశాడు. చాలా వేగంగా వెనక్కి లాగడంతో ఆ వ్యక్తి కిందపడబోయాడు. అది చూసి అక్కడున్న ఫొటోగ్రాఫర్లంతా ఏం చేస్తున్నావంటూ ఆ సెక్యూరిటీపై అరిచారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీ మానవత్వం ఎక్కడికెళ్లింది అంటూ విరల్ భయానీ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీనిపై చాలా మంది మండిపడ్డారు. ఆ అభిమాని దివ్యాంగుడు. అలాంటి వ్యక్తితో అంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సౌత్ యాక్టర్స్ ఇంతే అంటూ కొందరు పోస్టులు చేయడం గమనార్హం. ఇదంతా నాగార్జున తప్పిదమే అన్నట్లుగా చాలా మంది అతన్ని నిందించారు.
నిజానికి ఆ అభిమానిని సెక్యూరిటీ వెనక్కి లాగుతున్న సమయంలో నాగ్ మరోవైపు చూస్తూ నడుస్తున్నాడు. దీనిని అతడు సరిగా గమనించలేనట్లుగా అనిపించింది. తర్వాత వీడియో వైరల్ గా మారి విమర్శలు రావడంతో దీనిపై స్పందిస్తూ ఎంతో హుందాగా క్షమాపణ చెప్పాడు. అయినా అతన్ని కొందరు విమర్శిస్తూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.
నాగ్, ధనుష్ కుబేర
నాగార్జున, ధనుష్ కలిసి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసమే ఇద్దరూ కలిసి ముంబై వెళ్లారు. ఈ సందర్భంగా ధనుష్ తనయుడు కూడా అతని వెంట ఉన్నాడు. ఈ సమయంలో లింగాను కూడా అతడు నీ తమ్ముడా అని నాగార్జున సరదాగా అడగడంతో.. లేదు నా కొడుకు అంటూ ధనుష్ నవ్వుతూ బదులిచ్చాడు.
ఈ మూవీలో నాగ్, ధనుష్ తోపాటు రష్మిక మందన్నా కూడా నటిస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు జిమ్ సర్బా కూడా కనిపించనున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
టాపిక్