Nagarjuna fan: అప్పుడు క్షమాపణ.. ఇప్పుడు అదే అభిమానితో ఫొటో దిగిన నాగార్జున.. అది నీ తప్పు కాదంటూ..
Nagarjuna fan: తాను గతంలో క్షమాపణ చెప్పిన అభిమానితోనే తాజాగా నాగార్జున కలిసి ఫొటో దిగాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆ దివ్యాంగ అభిమానితో ప్రత్యేకంగా మాట్లాడాడు.
Nagarjuna fan: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలుసు కదా. ఓ దివ్యాంగుడైన అభిమానితో అతని బాడీగార్డ్ దురుసుగా ప్రవర్తించడం తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ ఘటనపై గతంలోనే స్పందించి క్షమాపణ చెప్పిన నాగ్.. తాజాగా అదే అభిమానితో కలిసి ఫొటోలు దిగాడు. ముంబై ఎయిర్‌పోర్టులోని ఈ వీడియో వైరల్ అయింది.
అప్పుడు క్షమాపణ.. ఇప్పుడు ఫొటో..
అక్కినేని నాగార్జున కుబేర మూవీ షూటింగ్ కోసం మరోసారి ముంబై వెళ్లాడు. అక్కడ ఎయిర్‌పోర్టులో ఈసారి అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈసారి దివ్యాంగుడైన ఆ అభిమాని కూడా నాగ్ తో కలిసి ఫొటో దిగాడు. అతడు నాగార్జున దగ్గరకు రాగానే.. మొన్న మీతో ఫొటో దిగాలనుకున్నది ఇతడే అని ఫొటోగ్రాఫర్లు గుర్తు చేశారు. దీంతో నువ్వేనా అంటూ నాగ్ అన్నాడు.
మిగిలిన అభిమానులతోనూ ఫొటోలు దిగిన తర్వాత మరోసారి ఆ దివ్యాంగ అభిమానితో మాట్లాడాడు. అతడు సారీ చెప్పడానికి రాగా.. ఇందులో నీ తప్పేమీ లేదంటూ అతనితో నాగార్జున అన్నాడు. మొన్న బాడీగార్డ్ దురుసు ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్న నాగార్జున.. తాజాగా అదే అభిమానితో ఫొటో దిగడం విశేషం.
అసలేం జరిగిందంటే?
ఈ మధ్య కుబేర మూవీ కోసం నాగార్జున ముంబై వెళ్లాడు. ఇదే సినిమాలో నటిస్తున్న ధనుష్ తో కలిసి అక్కడి ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడైన అభిమాని నాగ్ తో ఫొటో దిగడానికి ప్రయత్నించగా.. పక్కనే ఉన్న అతని బాడీగార్డ్ ఆ అభిమానిని వెనక్కి లాగాడు. దీంతో అతడు కిందపడబోయాడు. ఈ వీడియో వైరల్ అయింది.
ఇదేనా మీ మానవత్వం అంటూ ఎంతో మంది నాగార్జునపై విమర్శలు కురిపించారు. అయితే తర్వాత దీని గురించి తెలుసుకున్న నాగార్జున.. ఆ అభిమాని క్షమాపణ చెప్పాడు. అలా జరగాల్సింది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని కూడా హామీ ఇచ్చాడు. ఇప్పుడు అదే నాగ్ తనతో ఫొటో దిగడంతో ఆ అభిమాని చాలా సంతోషంగా కనిపించాడు.
ప్రస్తుతం నాగార్జున.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న కుబేర మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్, రష్మిక కూడా నటిస్తున్నాడు. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. గత నెలలోనే ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.
టాపిక్