Naga Chaitanya: శోభితతో పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నా.. తండేల్ మూవీ వాటికి నా సమాధానం: హిందుస్థాన్ టైమ్స్‌తో నాగ చైతన్య
Naga Chaitanya: శోభితతో పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు నాగ చైతన్య. తండేల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడిన అతడు.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పెళ్లితోపాటు తండేల్ మూవీ, ఫెయిల్యూర్, సక్సెస్ లపై అతడు స్పందించాడు.
Naga Chaitanya: నాగ చైతన్య తన నెక్ట్స్ మూవీ తండేల్ తో ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ తో అతడు మాట్లాడాడు. కెరీర్లో తొలిసారి ఓ పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తున్న చైతన్య.. ఈ మూవీలో పని చేయడంతోపాటు శోభితతో పెళ్లి, ఇతర అంశాలపైనా స్పందించాడు.

శోభితతో పెళ్లి ఎంజాయ్ చేస్తున్నా: నాగ చైతన్య
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెతో పెళ్లి జీవితంపై అతడు హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో స్పందించాడు. "పెళ్లి తర్వాత జీవితం చాలా గొప్పగా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. రెండు నెలలే అయింది. అయితే మేమిద్దరం ఒకరికొకరం తగినంత సమయం కేటాయిస్తున్నాం. అటు షూటింగులు, ఇటు వ్యక్తిగత జీవితానికి సమానంగా సమయం ఇస్తుండటంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంది" అని చైతన్య అన్నాడు.
ఇక తనలో, శోభితలో చాలా విషయాలు ఒకేలా ఉన్నట్లు కూడా చెప్పాడు. "మేమిద్దరం ఆంధ్రాకు చెందిన వాళ్లం. ఆమెది వైజాగ్. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం ఒకే నగరాలకు చెందిన వాళ్లం కాకపోయినా.. మా మూలాలు ఒకేలా ఉన్నాయి. దీంతో సాంస్కృతికంగా చాలా వరకు కనెక్ట్ అయ్యాం. ఇద్దరికీ సినిమా అంటే ఇష్టం. ఇద్దరం వాటిపైనే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎక్కువగా ట్రావెల్ కూడా చేస్తాం" అని చైతన్య తెలిపాడు.
తండేల్ మూవీ దానికి సమాధానం
ఇక తన తర్వాతి సినిమా తండేల్ పైనా అతడు స్పందించాడు. పుష్పలాంటి భారీ బడ్జెట్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న నేపథ్యంలో చైతన్య కూడా వీటిపై ఆసక్తికరంగా ఉన్నాడా? దీనికి కూడా అతడు సమాధానం ఇచ్చాడు. "ఒకరకంగా తండేల్ మూవీ దీనికి సమాధానంలాంటిదే అని నేను అనుకుంటున్నాను.
ఇప్పటి వరకూ నన్ను చూడని విధంగా మీరు తండేల్ మూవీలో చూస్తారు. ఫిబ్రవరి 7న మీకు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. మీ ప్రశ్నకు ఫిబ్రవరి 7న సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను" అని చైతన్య అన్నాడు.
ఇక సక్సెస్, ఫెయిల్యూర్ పైనా అతడు స్పందించాడు. "సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ను మీరు మరీ సీరియస్ గా తీసుకోకూడదు. వాటిని అలాగే తీసుకోవాలి. ఏది వర్కౌట్ అయింది, ఏది కాలేదన్నదానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముందడుగు వేయాలి. ప్రతి శుక్రవారం ఓ కొత్త అనుభవం" అని చైతూ అభిప్రాయపడ్డాడు. ఇక శోభితతో కలిసి మూవీ చేయడంపై స్పందిస్తూ.. తగిన స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తామని అన్నాడు.
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేశాడు. ఈ పాన్ ఇండియా సినిమాపై చైతన్య భారీ ఆశలే పెట్టుకున్నాడు.
సంబంధిత కథనం