నాగ చైతన్య ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. అతని కొత్త సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సినిమా షూటింగ్, ప్రి ప్రొడక్షన్ వర్క్, రిహార్సల్ వివరాలతో బిహైండ్ ది సీన్స్ (బీటీఎస్) వీడియోను రిలీజ్ చేశారు. కార్తీక్ దండు డైరెక్షన్ లో ఎన్‌సీ24 మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘ఎన్‌సీ24: ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్’ అనే టైటిల్ తో వీడియో రిలీజ్ చేశారు.
ఎన్‌సీ24: ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్ అనే టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లోకేషన్స్, సినిమా కోసం ఏళ్లుగా పడుతున్న కష్టం.. అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. వీడియోలో.. చిత్ర బృందం సెట్‌ను ప్లాన్ చేసి, కథాంశానికి తగినట్లుగా డిజైన్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ మూవీకి ‘వృషకర్మ’ అనే పేరును ఖరారు చేశారని తెలిసింది.
నాగ చైతన్య కొత్త మూవీ మిథికల్ థ్రిల్లర్ గా రెడీ అవుతోంది. ఈ మూవీకి లుక్ టెస్ట్ కోసం నాగ చైతన్య హెయిర్ కట్ చేయించుకుంటున్న దృశ్యం కూడా వీడియోలో ఉంది. ఈ చిత్రం కోసం అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, నీల్ డి. కున్హా సినిమాటోగ్రాఫర్. శ్రీ నాగేంద్ర తాంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటర్.
"సంవత్సరాల ఆలోచనలు. నెలల తరబడి సన్నాహాలు. అనంతమైన రిహార్సల్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది రాబోయే తుఫానులో కేవలం ఒక చిన్న శబ్దం మాత్రమే! ఎన్‌సీ24 ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్. మీరు సీటు అంచున కూర్చోపెట్టే ఎప్పుడూ చూడని మిథికల్ థ్రిల్లర్ కు రెడీ అవండి’’ అని ఎక్స్ లో నాగ చైతన్య పోస్టు చేశాడు. ‘తండేల్’ సినిమాతో నాగ చైతన్య ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
విరూపాక్ష మూవీతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ కార్తీక్ దండు. ఇప్పుడు నాగ చైతన్య మూవీతోనూ మరోసారి మ్యాజిక్ చూపిస్తానంటున్నాడు. ఇదివరకెప్పుడూ చూడని సరికొత్త మైథలాజికల్ కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బీటీెఎస్ వీడియోతోనే అంచనాలు పెంచేశాడు. ఈ మూవీలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరీ నటించే అవకాశముంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ ఈ మూవీని ప్రోడ్యూస్ చేస్తున్నారు. భారీ రేంజ్ లో ఈ మూవీని రెడీ చేసేందుకు ట్రై చేస్తున్నారు.
సంబంధిత కథనం