Nag Ashwin on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మైథలాజికల్ సై-ఫి మూవీలో ప్రభాస్, దీపికాతోపాటు అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లను డైరెక్ట్ చేయడంపై ఫిల్మ్ కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ స్పందించాడు.
కల్కి 2898 ఏడీ మూవీలో పెద్ద పెద్ద స్టార్లు నటించారు. మరి అలాంటి వాళ్లను డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా నాలుగైదు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమితాబ్, కమల్ హాసన్ లాంటి వారికి ఎలా నటించాలో చెప్పడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదే విషయంపై తాజా ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ స్పందించాడు.
"నేను డైరెక్ట్ చేసి అప్పటికి రెండేళ్లు అవుతోంది. ఈ సినిమా కోసం నా తొలి షాట్ మిస్టర్ బచ్చన్ తోనే ఉండింది. ఈ సినిమాలో అతనివి కొన్ని మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. కానీ అది అతడైనా, కమల్ సర్ అయినా వాళ్లు తమను కూడా డైరెక్ట్ చేయాలనే అనుకుంటారు. వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగినా.. నేర్చుకుంటూనే ఉంటారు. ప్రభాస్ లేదా దీపికా అయినా సరే.. వాళ్లకున్న స్టార్‌డమ్, వాళ్ల నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో నాకు బాగా తెలుసు. అందుకు తగినట్లే పని చేశాను" అని నాగ్ అశ్విన్ అన్నాడు.
గతంలో అతడు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్లను డైరెక్ట్ చేశాడు. మరి ఈ కల్కి 2898 ఏడీ మూవీలో వాళ్లు అతిథి పాత్రలు చేశారా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదు.
ఇదే ఇంటర్వ్యూలో కల్కి 2898 ఏడీ సినిమా గురించి నాగ్ అశ్విన్ మాట్లాడాడు. "నిజం చెప్పాలంటే ఈ సినిమాను నేను 10-12 ఏళ్ల వయసున్నప్పుడు చూడటానికి ఇష్టపడే విధంగా తీశాను. ఈ సినిమాలో నేను పెట్టిన ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ను ఆ పిల్లవాడు ఇష్టపడతాడు.
కానీ మొదట్లో ఈ సినిమాకు సంబంధించిన ఫుడ్, వెహికిల్స్, పరస్పర సంబంధాలు వంటి విషయాలపై ఎటూ తేల్చుకోలేకపోయాను. మూవీ ప్రారంభించినప్పుడు మనుషులు మాస్కులు పెట్టుకోవడం, ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించడంలాంటివి ఆలోచించాం. ఇప్పుడవన్నీ నిజంగా జరుగుతున్నవే" అని నాగ్ అశ్విన్ అన్నాడు.
రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ వారం మొదట్లోనే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ నటించారు. ఇక కమల్ హాసన్ విలన్ గా ఓ అతిథి పాత్ర పోషించాడు. అతని పాత్రకు తగినట్లే ట్రైలర్ లోనూ చివర్లో కాసేపు మాత్రమే కమల్ కనిపించాడు.
టాపిక్