Leo Naa Ready Song: లియో ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ‘నా రెడీ’ అంటూ దుమ్మురేపిన దళపతి విజయ్
Leo Naa Ready Song: దళపతి విజయ్ మూవీ ‘లియో’ నుంచి తొలి పాట విడుదలైంది. నా రెడీ అంటూ మాస్ బీట్‍తో అదిరిపోయేలా ఉంది ఈ సాంగ్.
Leo Naa Ready Song: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ‘లియో’ సినిమా నుంచి తొలి పాట వచ్చేసింది. నేడు (జూన్ 22) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ లియో మూవీ నుంచి ‘నా రెడీ’ అనే పాటను తమిళంలో విడుదల చేసింది. లిరికల్ సాంగ్‍ను తీసుకొచ్చింది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ లియో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సంగీతం అందించాడు. ఈ ‘నా రెడీ’ పాట మాస్ బీట్‍తో అదిరిపోయేలా ఉంది. వివరాలు ఇక్కడ చూడండి.
నా రెడీ పాటను హీరో విజయ్, అనిరుధ్ రవిచంద్రన్ పాడారు. ప్రారంభం నుంచి చివరి వరకు మాస్ బీట్‍తో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా నా రెడీ పాట ఉంది. ఈ సాంగ్‍లో నోట్లో బీడీతో విజయ్ మాస్ లుక్‍తో అదిరిపోయేలా ఉన్నాడు. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో ఈ సాంగ్ తెరకెక్కింది. చూడడానికి చాలా గ్రాండ్‍గా కనిపిస్తోంది. మాస్ స్టెప్పులతో విజయ్ రెచ్చిపోయాడు. నా రెడీ పాటకు విష్ణు ఎడవన్.. లిరిక్స్ అందించాడు.
మాస్టర్ తర్వాత దళపతి విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వస్తున్న రెండో చిత్రం లియో. విక్రమ్ మూవీతో గతేడాది సూపర్ హిట్ కొట్టి సూపర్ ఫామ్‍లో ఉన్న లోకేశ్ కనగరాజ్.. విజయ్‍ను యాక్షన్ అవతార్‌లో చూపించనున్నాడు. లియో చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విజయ్ సరసన హీరోయిన్ పాత్రను త్రిష నటిస్తోంది. అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లియో మూవీని అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. తమిళం, తెలుగుతో హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ లియో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మనోజ్ పరమహంస.. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ఉన్నాడు.
లియో ఫస్ట్ లుక్ కూడా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు విడుదలైంది. ఈ పోస్టర్‌లో విజయ్ తన చేతిలో సుత్తి పట్టుకొని ఉండగా.. రక్తం చిందుతోంది. బ్యాక్‍గ్రౌండ్‍లో హైనా కూడా ఉంది. లియో ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఈ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. లోకేశ్ గత సినిమాలకు లియోకు లింక్ కూడా ఉంటుందని తెలుస్తోంది.