Muthu Re-release: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ ముత్తు. 28 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. రీరిలీజ్ తేదీని చాలా రోజుల కిందటే అనౌన్స్ చేశారు. అయితే తీరా రిలీజ్ సమయానికి షోలన్నింటినీ రద్దు చేయాల్సి వచ్చింది.
ముత్తు సినిమా రీరిలీజ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి అసలు ఎలాంటి స్పందనా లేదు. అసలు టికెట్లు అమ్ముడుపోకపోవడంతో అన్ని షోలనూ రద్దు చేశారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలుసు కదా. ముఖ్యంగా తెలుగులోని పెద్ద హీరోలు మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణలాంటి వాళ్ల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి.
కొన్ని సినిమాలు సంచలన వసూళ్లు సాధించగా.. మరికొన్ని చూసేవాళ్లు లేక షోలు రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా రజనీకాంత్ ముత్తుకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. 1995లో రిలీజైన ఈ సినిమా తమిళనాడులో 175 రోజులు ఆడగా.. తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తర్వాత జపాన్ లోనూ రిలీజై ఊహించని విజయం సొంతం చేసుకుంది.
పైగా ఈ ఏడాది జైలర్ మూవీతో హిట్ కొట్టిన రజనీకాంత్ ఒకప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా కావడంతో ముత్తుకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు. కానీ అంతా రివర్సయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకపోవడంతో షోలను రద్దు చేయాలని థియేటర్లు యజమానులు నిర్ణయించారు.
తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న రజనీకాంత్ కు ఇది నిజంగా చేదు అనుభవమే. ముత్తు సినిమాను కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేశాడు. ముత్తుకు ఆదరణ లభించకపోయినా.. ఇప్పుడు రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12) నేపథ్యంలో డిసెంబర్ 9న అతని మరో హిట్ మూవీ శివాజీ ది బాస్ రీరిలీజ్ కానుంది.