తెలుగు సినిమా ముత్తయ్య నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టనుంది. థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమై ప్రశంసలు, అవార్డులను ఈ మూవీ అందుకుంది. ‘బలగం’ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ఈ ముత్తయ్య సినిమా ట్రైలర్‌ను నేడు (ఏప్రిల్ 28) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ట్రైలర్ ఎలా ఉందో.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
చెన్నూరు అనే ఓ చిన్న గ్రామంలో నివసించే 70 ఏళ్ల వృద్ధుడు ముత్తయ్య (సుధాకర్ రెడ్డి) చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. నాటకంలో వేషం ఇవ్వాలని ఓ వ్యక్తిని ముత్తయ్య అడగడంతో ట్రైలర్ మొదలైంది. సినిమాలంటే ఆయనకు చాలా పిచ్చి ఉంటుంది. అందుకే థియేటర్లో చిత్రాలు చూస్తూనే ఉంటాడు. పాత సినిమాలంటేనే ఎక్కువ ఇష్టమున్నా.. ఇప్పుడు యాక్టింగ్ ఛాన్స్ వస్తే ఎలా చేయాలో తెలుసుకునేందుకు కొత్తవి చూస్తున్నానని చెబుతాడు. మెకానిక్ మల్లితో ముత్తయ్య స్నేహంగా ఉంటాడు.
యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండే ముత్తయ్య తాను వీడియోలు చేద్దామని అనుకుంటున్నానని మల్లితో చెబుతాడు. ఫోన్‍లోనే వీడియోలు తీస్తారు. ఇది సరదాగా సాగుతుంది. వారి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంతలోనే వారి ఊర్లో కొందరు షార్ట్ ఫిల్మ్ చేస్తుంటారు. ముత్తయ్య కూడా ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని అనుకుంటాడు. అందుకు రూ.లక్ష ఖర్చవుతుందని ఓ వ్యక్తి చెబుతాడు.
ఈ వయసులో సినిమాల పిచ్చి ఎందుకని ముత్తయ్యతో అంటుంటారు. “ఏదైనా కోరిక ఉంటే వెంటనే తీర్చుకోవాలి. లేకపోతే అక్కడే బొందపెట్టాలి. నా లెక్క వెంబడి పెట్టుకొని తిరగొద్దురా” అని ముత్తయ్య బాధగా అంటాడు. ఆర్థికంగా కష్టాలు ఉన్నా షార్ట్ ఫిల్మ్ తీసి అందరికీ చూపించాలని అనుకుంటాడు. ముత్తయ్య అని థియేటర్లో టైటిల్ పడుతుంది. ఆకుచాటు పిందె తడిచే అంటూ ముత్తయ్య పాటపాడుతూ వీడియో తీసే సీన్‍తో ట్రైలర్ ముగిసింది. ముత్తయ్య అనుకున్నట్టు షార్ట్ ఫిల్మ్ తీశాడా.. యాక్టర్ అయ్యాడా అనేది సినిమాలో చూడాలి.
ముత్తయ్య సినిమా ట్రైలర్ సరదాగా ఉంటూనే ఎమోషనల్‍గానూ టచ్ చేసింది. హృదయాన్ని తాకేలా కొన్ని సీన్లు ఉన్నాయి. ఈ చిత్రానికి భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వంశీ కారుమంచి, వ్రిందా ప్రసాద్ నిర్మించగా.. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం ఇచ్చారు. సుధాకర్ రెడ్డితో పాటు అరుణ్ కుమార్, పూర్ణచందర్, మోనిక బొమ్మ, సాయిలీల కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
ముత్తయ్య సినిమా మే 1వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్‍ను ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. ఈ ఫీల్ గుడ్ మూవీ ఈటీవీ విన్‍లో మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2022లోనే ముత్తయ్య చిత్రం రూపొందింది. కోల్‍కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైన ఈ మూవీ భారతీయ భాషల్లో బెస్ట్ ఫీచర్ సినిమా అవార్డు సొంతం చేసుకుంది. ఇండిక్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లోనూ అవార్డు దక్కించుకుంది. యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా మరిన్ని అంతర్జాతీయ వేదికలపై ఈ మూవీ ప్రదర్శితమైంది. ప్రశంసలు దక్కించుకుంది. మే 1 నుంచి ఈటీవీ విన్‍లో ముత్తయ్య చిత్రాన్ని చూడొచ్చు.
సంబంధిత కథనం