OTT Joju George Movies: మలయాళం సినిమాలంటేనే విలక్షణ కథలతో ఆకట్టుకుంటాయని పేరుంది. అందులోనూ జోజు జార్జ్ లాంటి నటులు ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. ఈ మధ్యే అతడు నటించి, డైరెక్ట్ చేసిన పని మూవీ సోనీ లివ్ ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. నటుడిగానే కాకుండా సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన జోజు జార్జ్ నటించిన సినిమాల్లో ప్రస్తుతం ఓటీటీలో ఉన్న బెస్ట్ మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.
జోసెఫ్ (2018) ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో జోజు జార్జ్ ఓ రిటైర్డ్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. అతను తన మాజీ భార్య మరణానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తాడు. నలుగురు రిటైర్డ్ పోలీసుల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మూవీ కుటుంబ సంబంధాల సంక్లిష్టతలను, గతం చూపించే భావోద్వేగపరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జోజు జార్జ్ కు మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ఈ జోసెఫ్ ఒకటి.
జోజు జార్జ్ నటించిన ఆంటోనీ 2023లో రిలీజైన మలయాళ సినిమా. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో ఆంటోనీ అనే గ్యాంగ్‌స్టర్ తాను పొరపాటున చంపిన వ్యక్తి కూతురికే సంరక్షకుడిగా మారతాడు. ఆ తర్వాత వారి జీవితాలు ముడిపడిపోతాయి. ఇందులో ఆంటోనీ పాత్రను జోజు జార్జ్ పోషించాడు.
మధురం 2021లో వచ్చిన మలయాళ రొమాంటిక్ డ్రామా. తమవారి కోసం తరచూ హాస్పిటల్స్ కు వచ్చే వారి మధ్య ఏర్పడే బంధం చుట్టూ తిరిగే మూవీ ఇది. ఇందులో జోజు జార్జ్.. సాబుగా నటించాడు. చిత్ర (శ్రుతి రామచంద్రన్)తో అతని ప్రేమకథ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. క్లిష్ట సమయాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన ప్రేమనే కాదు.. హాస్పిటల్లో ఉన్న తమ వారు కోలుకోవాలని వేయి కళ్లతో ఎదురు చూసే వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువుల పోరాటాలు, సవాళ్లను కూడా ఈ మూవీ ప్రధానంగా చూపిస్తుంది.
చురులి లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన 2021 మలయాళ మూవీ. ఇది షాజీవన్, ఆంటోనీ (వినయ్ ఫోర్ట్, చెంబన్ వినోద్ జోస్) అనే ఇద్దరు అండర్ కవర్ పోలీసుల కథను చెబుతుంది. వారు జాయ్ అని పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి ఓ మారుమూల గ్రామానికి వెళ్తారు. ఆ తర్వాత వాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నార్నది ఈ సినిమాలో చూడొచ్చు.
నాయట్టు 2021లో రిలీజైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఇది ముగ్గురు పోలీస్ అధికారులు చుట్టూ తిరిగే కథ. ఓ దళిత వ్యక్తి మరణంలో వాళ్లను తప్పుగా ఇరికిస్తారు. రాజకీయ కారణాలకు ఆ ముగ్గురు బలవుతారు. అందులో నుంచి బయటపడటానికి వాళ్లు పారిపోతారు. చివరికి ఆ ముగ్గురు పోలీసుల జీవితాలు ఏమవుతాయి? వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా అన్నదే ఈ సినిమా స్టోరీ. తెలుగులో చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఆహా వీడియోలోనూ అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం