Music Shop Murthy Review: మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ - చాందిని చౌదరి, అజయ్ ఘోష్ మూవీ ప్లస్‌లు...మైనస్‌లు ఇవే
Music Shop Murthy Review: చాందిని చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
Music Shop Murthy Review: అజయ్ ఘోష్, చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు శివ పాలడుగు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?
డీజే మూర్తి కథ..
మూర్తి (అజయ్ ఘోష్) ఓ మ్యూజిక్ షాప్ ఓనర్. ఒకప్పుడు బాగా నడిచిన మూర్తి షాప్ టెక్నాలజీ పెరిగిపోవడంతో గిరాకీ తగ్గిపోతుంది. క్యాసెట్లు కొనేవారు ఎవరూ లేకపోయినా మ్యూజిక్‌పై ఉన్న ప్రేమతో ఎన్నో తంటాలు పడి షాన్‌ను రన్‌చేస్తుంటాడు.
దాంతో భార్య జయ (ఆమని)పైనే ఇంటి బాధ్యతలు పడతాయి. కష్టపడి ఇద్దరు పిల్లలను చదివిస్తుంటుంది. మ్యూజిక్ షాప్ క్లోజ్ చేసి మొబైల్ రిపేరింగ్ షాప్ పెట్టుకోమని జయ ఎంత చెప్పిన మూర్తి మాత్రం వినడు.
ఓ బర్త్‌డే పార్టీ కారణంగా డీజే అవ్వాలనే కోరిక మూర్తిలో మొదలవుతుంది. డీజే కావాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియా వచ్చిన అంజనతో (చాందిని చౌదరి) మూర్తికి పరిచయం ఏర్పడుతుంది. మూర్తికి డీజే ప్లే చేయడం నేర్పించడానికి తొలుత నిరాకరించిన అంజన..మ్యూజిక్‌పై అతడికి ఉన్న ఆసక్తిని గమనించి అంగీకరిస్తుంది.
డీజే కావాలని అనుకునే మూర్తి ప్రయాణం ఎలా సాగింది? మూర్తిని జయ ఇంట్లో నుంచి ఎందుకు గెంటేసింది? అంజన కనిపించడం లేదంటూ మూర్తిపై ఆమె తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏమిటి? నిజంగానే అంజన అదృశ్యం అయ్యిందా? చివరకు తన కలను మూర్తి ఎలా సాధించాడు? అన్నదే ఈ మూవీ(Music Shop Murthy Review) కథ.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ...
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా తమిళం, మలయాళ భాషల్లోనే తెరకెక్కుతుంటాయని, తెలుగులో రావని చెబుతుంటారు. అలాంటి వారికి ఓ సమాధానంగా మ్యూజిక్ షాప్ మూర్తి నిలుస్తుంది. మ్యూజిక్ షాప్ మూర్తి రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాత్రం కాదు. కథ పాతదే అయినా ట్రీట్‌మెంట్ మాత్రం కొత్తగా ఉంటుంది.
ఏజ్ అన్నది ఓ నంబర్ మాత్రమే...
లక్ష్యానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని, ఏజ్ అన్నది జస్ట్ ఓ నంబర్ మాత్రమేనని సందేశాన్ని మ్యూజిక్ షాప్ మూర్తి ద్వారా ఇచ్చారు దర్శకుడు. సందేశం పేరుతో లెక్చర్ ఇస్తున్నట్లుగా సీరియస్‌గా కాకుండా నవ్విస్తూనే తాను చెప్పాలనుకున్న అంశాన్ని అర్థవంతంగా ఈ సినిమా ద్వారా ప్రజెంట్ చేశారు డైరెక్టర్. ఫ్యామిలీ డ్రామా కథలో ఆ మెసేజ్‌ను షుగర్ కోటెడ్‌లా రాసుకున్న తీరు బాగుంది.
కథ పాతదే కానీ...
అనామక హీరో...పెద్ద లక్ష్యం కోసం కోసం పాటుపడటం, ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు విజయాన్ని అందుకోవడం అనే పాయింట్‌తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. మ్యూజిక్ షాప్ మూర్తి కూడా అలాంటి రొటీన్ కథతోనే సాగుతుంది. కథ పాతదే కానీ కథనంలో దర్శకుడు మ్యాజిక్ చేశాడు.
యాభై రెండే ఏళ్లు (సినిమాలో చూపించారు) పై బడిన అజయ్ ఘోష్‌ను హీరోగా చూపించాలనే దర్శకుడి ఐడియానే కొత్తగా ఉంది. మ్యూజిక్ షాప్ బ్యాక్‌డ్రాప్...కాసెట్ల జమానాతో నుంచి డీజే వరకు అలనాటి నుంచి నేటి తరం వరకు అందరికి కనెక్ట్ అయ్యేలా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ ఎమోషన్స్‌తో సినిమాను నడిపించాడు.
ఫస్ట్ హాఫ్ ఫన్...సెకండాఫ్ ఎమోషన్స్..
ఫస్ట్ హాఫ్ మొత్తం మ్యూజిక్ షాప్ సరగ్గా నడవక మూర్తి పడే కష్టాలు, భార్య పోరు పడలేక ఎదుర్కొనే ఇబ్బందులతో సరదాగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం మూర్తి ప్రయాణాన్ని హృద్యంగా ఆవిష్కరించారు డైరెక్టర్. ఒక్క డబుల్ మీనింగ్ జోక్, గ్లామర్ సీన్ లేకుండా క్లీన్‌గా ఈ మూవీని తెరకెక్కించడం బాగుంది.
తెలిసిన కథే...
తెలిసిన కథే కావడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. మూర్తి జర్నీ కొన్నిచోట్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. ఒకటి, రెండు మినహా పెద్దగా ట్విస్ట్‌లు లేవు.
అజయ్ ఘోష్ యాక్టింగ్...
యాభై ఏళ్ల వయసులో డీజే కావాలని తపించే వ్యక్తి పాత్రలో అజయ్ ఘోష్ జీవించాడు. మూర్తి తప్ప అజయ్ ఘోష్ ఎక్కడ కనిపించలేదు. చాందని చౌదరి మరోసారి యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో వింటేజ్ ఆమని గుర్తొచ్చింది. శుభలగ్నం లాంటి క్యారెక్టర్‌లో మెప్పించింది. భానుచందర్‌తో పాటు మిగిలిన వారంతా తమ అనుభవంతో మెప్పించారు,
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్...
మ్యూజిక్ షాప్ మూర్తి అశ్లీలత, అసభ్యతకు తావు లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అజయ్ ఘోష్, చాందని చౌదరి నటనతో పాటు కథలోని సందేశం మెప్పిస్తుంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మాత్రం డిసపాయింట్ చేయదు.
రేటింగ్: 3/5
టాపిక్