Mura Review: మురా రివ్యూ - ఊహలకు అందని ట్విస్ట్‌లతో సాగే మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Mura Review: మలయాళం మూవీ మురా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, హ్రిదూ హరున్ కీలక పాత్రల్లో నటించారు.
Mura Review: యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన మలయాళం మూవీ మురా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సూరజ్ వెంజరమూడు, హ్రిదూ హరున్, జోబిన్ దాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి మహమ్మద్ ముస్తాఫా దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
నలుగురు స్నేహితుల కథ…
ఆనందు (హ్రిదూ హరున్) డిగ్రీ మధ్యలోనే ఆపేస్తాడు. తన స్నేహితులు మను (ఎదు కృష్ణ), షాజీ (జోబిన్ దాస్), మనాఫ్‌లతో (అనుజీత్) కలిసి ఓ రౌడీ గ్యాంగ్‌లో చేరుతాడు. తమ ధైర్యసాహసాలు, తెగువతో లోకల్ గ్యాంగ్‌స్టర్ అని (సూరజ్) దృష్టిలో పడతారు. రెండు ఎటాక్స్ నుంచి ప్రాణాలకు తెగించి అనిని కాపాడుతారు. ఓ పాత పడిన స్టీల్ ఫ్యాక్టరీలో భారీగా బ్లాక్‌మనీ ఉందనే ఇన్ఫర్మేషన్ అనికి అందుతుంది. ఆ బ్లాక్‌మనీని దొంగతనం చేసే డీల్ ఆనందుతో పాటు అతడి స్నేహితులకు ఇస్తాడు అని.
ఆ సీక్రెట్ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారు ఆనందు అతడి ఫ్రెండ్స్. ఈ డీల్ పూర్తి చేస్తే వచ్చే కమీషన్ డబ్బుతో ఏదైనా బిజినెస్ పెట్టుకొని రౌడీ జీవితానికి దూరంగా ఉంటాలని కలలు కంటారు. కానీ కమీషన్ విషయంలో అని అక్కయ్య రమాదేవి (మాలా పార్వతి) ఆనందు అతడి స్నేహితులను మోసం చేస్తుంది. డబ్బు అడిగినందుకు ఆనందు, షాజీ, మనాఫ్, మనులను రమాదేవి కొడుకు దారుణంగా కొడతాడు.
రమాదేవితో పాటు ఆమె కొడుకుపై రివేంజ్ తీర్చుకోవాలని భావించిన నలుగురు స్నేహితులు ఏం చేశారు? ఈ పోరాటంలో మను, షాజీ, మనాఫ్ ఎలా ప్రాణాలను కోల్పోయారు. స్నేహితుల మరణానికి కారణమైన అని, రమాదేవిలను ఆనందు ఏం చేశాడు? అన్నదే మురా మూవీ కథ.
జగడం...ఆవేశం...
అప్పుడప్పుడే టీనేజ్ దాటిన ఓ నలుగురు కుర్రాళ్లు....రౌడీయిజం, గొడవలకు ఆకర్షితులై తప్పుడు దారుల్లో ప్రయాణిస్తే చివరకు వారి జీవితాలు ఎలా ముగిశాయన్నదే మురా మూవీ కథ. ఈ పాయింట్ కొత్తదేమీ కాదు. చాలా మంది దర్శకులు ఈ పాయింట్‌ను డిఫరెంట్ యాగింగ్స్‌లో స్క్రీన్‌పై ఇది వరకే చూపించేశారు. తెలుగులో వచ్చిన జగడం ఇంచు మించు ఇదే కథ.
ఇటీవల రిలీజైన ఫహాద్ ఫాజిల్ ఆవేశం ఇలాంటి పాయింట్‌తోనే వచ్చి వంద కోట్లు కోట్లు కొల్లగొట్టింది. ఈ రొటీన్ పాయింట్‌తోనే మహమ్మద్ ముస్తాఫా మాత్రం మురా మూవీ కథను రాసుకున్నాడు.
ఫాస్ట్ ఫేజ్ యాక్షన్ సీక్వెన్స్, ఛేజింగ్స్, రేసీ స్క్రీన్‌ప్లేతో సినిమా అయితే బోర్ కొట్టదు. అలాగని మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీల్ ఇవ్వదు. సినిమాకు కీలకమైన బ్లాక్‌మనీ పాయింట్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే సినిమా రిజల్ట్ మరో లెవెల్‌లో ఉండేది.
నేషనల్ అవార్డ్ విన్నర్...
సూరజ్ వెంజరమూడు నేషనల్ అవార్డ్ విన్నర్. అయితే కెరీర్‌లో ఎక్కువగా కామెడీ తరహా క్యారెక్టర్స్‌లోనే ఎక్కువగా కనిపించాడు. గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌కు అతడు రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. సిటీనే గడగడలాడించే గ్యాంగ్‌స్టర్‌గా అతడి క్యారెక్టర్‌ను పరిచయం చేశాడు. ఆ తర్వాత కంప్లీట్‌గా క్యారెక్టర్ గ్రాఫ్ డౌన్ అవుతునే వచ్చింది. మిడిల్‌లోనే అతడిని పూర్తిగా సైడ్ చేసేశారు.
లేడీ విలన్...
లేడీ విలన్ ఐడియా బాగుంది. తన మైండ్‌గేమ్‌తో నలుగురు స్నేహితుల్ని లేడీ విలన్ దెబ్బతీసే సీన్స్ గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. కమర్షియల్ ఫార్మెట్‌కు భిన్నంగా సినిమాను ఎండ్ చేయడం బాగుంది. ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. మధ్యలో కొన్ని లవ్ సీన్లు ఉన్నా అవన్నీ సినిమా లెంగ్త్‌ను పెంచడానికే పెట్టినట్లుగా అనిపిస్తాయి.
రివేంజ్‌డ్రామాతో...
ఫస్ట్ హాఫ్ అని గ్యాంగ్‌లో నలుగురు స్నేహితులు ఎలా చేరారు? అని కోసం వారు చేసే ఫైట్స్‌తో సాగిపోతుంది బ్లాక్‌మనీ కొట్టేసే డీల్‌కు ఒప్పుకోవడంతో సెకండాఫ్ మొదలవుతుంది. ఆ దొంగతనం ఎలా చేశారు? రమాదేవి వారిని చేసే మోసం, రమాదేవి గ్యాంగ్‌కు, నలుగురు స్నేహితులకు మధ్య రివేంజ్ డ్రామాతో సెకండాఫ్ సాగుతుంది.
హీరోలు ఎవరూ లేరు...
ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలు అంటూ ఎవరు లేరు. నలుగురు ఫ్రెండ్స్‌లో హ్రిదు హరుణ్ ఎక్కువగా హైలైట్ అయ్యాడు. ఆనందు పాత్రలో ఇంటెన్స్ యాక్టింగ్ కనబరిచాడు. జోబిన్ దాస్, ఎదుకృష్ణ, అనుజీత్‌ల నటన కూడా ఓకే. సూరజ్ వెంజరమూడు అనుభవాన్ని, యాక్టింగ్ టాలెంట్‌ను దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. అతడి క్యారెక్టర్ ప్రజెంటేషన్‌లోనే దర్శకుడు తప్పటడగులు వేసినట్లుగా అనిపిస్తుంది. విలన్‌గా మాలా పార్వతి నటన బాగుంది.
రొటీన్ కానీ...
మురా కథ రొటీన్ అయినా యాక్షన్ ఎపిసోడ్స్, నలుగురు కుర్రాళ్ల నటన కోసం ఓ సారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది.