Thandel Movie: తండేల్ మూవీ ఆ తెలుగు నవలకు స్ఫూర్తినా? - సేమ్ స్టోరీ!
Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ తొలిరోజు 21 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నాగచైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. తండేల్ మూవీకి చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు అనే నవల స్ఫూర్తి అని ప్రచారం జరుగుతోంది.

Thandel Movie: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ మత్య్సకారుడి ప్రేమకథకు దేశభక్తిని జోడించి దర్శకుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెరకెక్కించాడు. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 21.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా తండేల్ నిలిచింది.
నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ...
నాగచైతన్య, సాయిపల్లవి యాక్టింగ్, వారిద్దరి కెమిస్ట్రీతో పాటు దేవిశ్రీప్రసాద్ పాటలు, బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తోన్నాయి. పాకిస్థాన్ కోస్ట్‌గార్డులకు దొరికి జైలు శిక్షను అనుభవించిన కొందరు మత్య్సకారుల జీవితాల ఆధారంగా తండేల్ సినిమాను రూపొందించినట్లు ప్రమోషన్స్‌లో దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాకు కార్తీక్ అనే రైటర్ కథను అందించినట్లు పేర్కొన్నారు. ఓ నవల రైట్స్ కూడా కొన్నట్లు అల్లు అరవింద్ చెప్పాడు. ఆ నవల పేరు మాత్రం మేకర్స్ వెల్లడించలేదు.
మున్నీటి గీతలు...
చింతకింది శ్రీనివాసరావు అనే రచయిత రాసిన మున్నీటి గీతలు అనే నవల ఆధారంగా తండేల్ మూవీ తెరకెక్కినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మున్నీటి గీతలు నవల మత్య్సకారుల జీవితాల ఆధారంగానే సాగుతుంది. మత్య్సవేనం అనే గ్రామానికి పోలారావు, ఎర్రమ్మ అనే జంట జీవితాల ప్రధానంగా చేసుకొని చింతకింది శ్రీనివాసరావు ఈ నవల రాశారు.
పోలారావు, ఎర్రమ్మ ప్రేమకథ...
మత్స్సవేనం గ్రామానికి చెందిన బెస్తలు చేపల వేట కోసం గుజరాత్‌లోని అరేబియా సముద్రానికి వలస వెళతారు. ఎనిమిది మాసాల వరకు చేపల వేట కోసం సముద్రంపైనే జీవిస్తుంటారు. ఓ సారి జీపీఎస్ పనిచేయకపోవడంతో పోలారావు బోటు పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశిస్తుంది. 27 మంది మత్స్సకారులను పాకిస్థాన్ కోస్టు గార్డులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. పాకిస్థాన్ జైలులో జాలర్లు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? మంచితనంతో పోలారావు పాకిస్థాన్ జైలు అధికారుల మన్ననల్ని ఎలా పోందాడు?
చివరకు జైలు నుంచి ఏ విధంగా విడుదలయ్యారు అన్నది ఈ నవలలో ఉంది. ఈ నవలలో పోలారావు, ఎర్రమ్మల ప్రేమను గాఢంగా, ఉన్నతంగా చూపించారు రైటర్. పోలారావును ప్రాణంగా ఇష్టపడ్డ ఎర్రమ్మ అతడిని కాదని మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటం లాంటి అంశాలను రైటర్ ఈ నవలలో టచ్ చేశారు. 2021లో ఈ నవల తానా పురస్కారాన్ని గెలుచుకుంది.
తండేల్‌కు దగ్గరగా...
ఈ నవల కథ చాలా వరకు తండేల్ మూవీకి దగ్గరగా ఉంది. నవలలోని చాలా భాగాలు తండేల్‌లో కనిపిస్తాయి.నవలలోని పోలారావు, ఎర్రమ్మ పాత్రలు నాగచైతన్య, సాయిపల్లవిని పోలి ఉన్నాయి ఈ నవల ఆధారంగానే తండేల్ మూవీ తెరకెక్కిందని చెబుతోన్నారు.
బన్నీవాస్...
తండేల్ మూవీ జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మించాడు. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య , సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ఇది.
సంబంధిత కథనం