Atharva । కొత్త అవతారంలో ఎం.ఎస్.ధోనీ.. ‘అథర్వ’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల-ms dhoni unveils his new avatar as atharva ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Atharva । కొత్త అవతారంలో ఎం.ఎస్.ధోనీ.. ‘అథర్వ’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Atharva । కొత్త అవతారంలో ఎం.ఎస్.ధోనీ.. ‘అథర్వ’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Manda Vikas HT Telugu
Feb 03, 2022 01:27 PM IST

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మరో సరికొత్త అవతారంలో దర్శనమిస్తున్నాడు. ధోనీ కథానాయకుడిగా 'అథర్వ- ది ఒరిజిన్' అనే పేరుతో ఒక గ్రాఫిక్ నవల వెబ్ సిరీస్ రూపంలో రాబోతుంది.

<p>అథర్వ అవతారంలో ఎంఎస్ ధోనీ</p>
అథర్వ అవతారంలో ఎంఎస్ ధోనీ (Atharva Makers)

మైదానంలో బ్యాట్ తిప్పిన ఆ చేయి.. తనకు మాత్రమే సొంతమైన హెలికాప్టర్ షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ చేయి.. నేడు కదనరంగంలో కత్తి తిప్పుతోంది. క్రికెట్ ఆటలో ఎవరి ఊహలకు అందని వ్యూహాలు రచించి ప్రత్యర్థి జట్లను మట్టి కరిపించిన అతడే నేడు భీకర యుద్ధం చేస్తూ శత్రువులను చీల్చి చెండాడుతున్నాడు. ఆ యోధుడెవరో మీకిప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అతడే టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని.

భారత క్రికెట్ జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా చేరిన ధోని ఆ తర్వాత జట్టుకు సారథిగా ఎదిగి, ఎన్నో మరపురాని గెలుపులను అందించాడు. తన కనుసన్నల్లో ఒక తరం క్రికెట్‌ను శాసించాడు. మైదానంలోనూ.. మైదానం బయటా ఎంతో మెచ్యూర్డ్ వ్యక్తిత్వాన్ని కనబరిచే ఈ కెప్టెన్ కూల్ ఇప్పుడు మరో సరికొత్త అవతారంలో దర్శనమిస్తున్నాడు. 

ధోనీ కథానాయకుడిగా 'అథర్వ- ది ఒరిజిన్' అనే పేరుతో ఒక గ్రాఫిక్ నవల వెబ్ సిరీస్ రూపంలో రాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ తాజాగా విడుదలయింది. ఇందులో ధోనీ తన యానిమేటెడ్ అవతార్‌లో రాక్షసులతో భీకర పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ టీజర్‌ను ధోని తన అభిమానులతో పంచుకున్నాడు. మరి మీరూ చూశారా ఆ టీజర్..?

Here's Atharva

కథేంటంటే..

ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఒక పౌరాణిక గాథ. ఇప్పటివరకు ఉన్న వివరాల ప్రకారం కథ చెప్పాలంటే.. హైటెక్ సదుపాయాలు కలిగిన ఒక బందీఖానాలో ఓ అఘోరి బందీగా ఉంటాడు. అతడి అంతుచిక్కని జీవిత ప్రయాణాన్ని ఈ కథ తెలియజేస్తుంది. ఇందులో ధోని ఒక యోధుడి పాత్రలో కనిపిస్తాడు. తన జీవిత ప్రయాణంలో భాగంగా అఘోరి వెల్లడించిన రహస్యాలు, వాస్తవాలు నేటి ఆధునిక యుగంలోని మూఢ నమ్మకాలను, మూస ధోరణిని మార్చివేస్తాయి.. అని ఈ వెబ్ నవల గురించి బ్రీఫింగ్ ఇచ్చారు.

రమేష్ తమిళ్మణి రాసిన ఈ కథను ధోనీ ఎంటర్టైన్మెంట్ సహాకారంతో విన్సెంట్ అడైకళరాజ్, అశోక్ మనోర్ నిర్మిస్తున్నారు. ఈ కథను సినిమా కంటే కూడా వెబ్-సిరీస్ రూపంలో తీసుకువస్తేనే బాగుంటుందని రూపకర్తలు భావించారు. కాబట్టి ఎపిసోడ్ల వారీగా వివిధ భాగాలుగా ఈ కథ ప్రసారం అవుతుంది. అయితే వెబ్ సిరీస్ ఏ దశలో ఉంది, దీని విడుదల తేదీని నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు.

గతంలో సినిమాగా వచ్చిన ఎం.ఎస్ ధోనీ బయోపిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Whats_app_banner