Mr. Bachchan Trailer Launch: రవితేజ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇక..
Mr. Bachchan Trailer Launch: మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కు షాకిచ్చారు మిస్టర్ బచ్చన్ మూవీ మేకర్స్. బుధవారం (ఆగస్ట్ 7) జరగాల్సిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను రద్దు చేశారు.
Mr. Bachchan Trailer Launch: మిస్టర్ బచ్చన్ మూవీ మేకర్స్ పెద్ద షాకే ఇచ్చారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీనికోసం బుధవారం (ఆగస్ట్ 7) హైదరాబాద్ లో భారీగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడా ఈవెంట్ ను రద్దు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.
మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ రద్దు
మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం (ఆగస్ట్ 7) సాయంత్రం 7.11 గంటలకు హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో జరుగుతుందని మేకర్స్ చెబుతూ వచ్చారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. రవితేజ ఫ్యాన్స్ కష్టమ్మీద పాస్‌లు కూడా సంపాదించారు. తీరా లాంచ్ ఈవెంట్ రోజు ఉదయమే మేకర్స్ షాకిచ్చారు. ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
ఈ మేరకు తమ అధికారికి ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ ప్రకటన జారీ చేశారు. "డియర్ ఫ్యాన్స్.. మేము ప్లాన్ చేసిన మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అనుకోని పరిస్థితుల్లో రద్దు చేస్తున్నట్లు చెప్పడానికి మేము ఎంతో చింతిస్తున్నాం. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పాస్ లు బుక్ చేసుకున్న అభిమానులందరికీ క్షమాపణ చెబుతున్నాం. మీ నిరాశను మేము అర్థం చేసుకోగలం. మాకూ నిరాశ కలుగుతోంది.
మరిన్ని అప్డేట్స్, వివరాల కోసం ప్రొడక్షన్ హౌజ్ అధికారిక కమ్యూనికేషన్ ఛానెల్స్ ను చూస్తూ ఉండండి. మాకు అండగా నిలుస్తూ ఉన్నందుకు థ్యాంక్స్. భవిష్యత్తులో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించడానికి ఎదురుచూస్తున్నాం" అని మిస్టర్ బచ్చన్ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ ప్రకటన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మళ్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మిస్టర్ బచ్చన్ మూవీ గురించి..
మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ తర్వాత నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. ఈగల్ తోపాటు అంతకుముందు వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు ఫ్లాపవడంతో ఈ మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.
అదే రోజు రామ్, పూరి కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ కూడా రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో ఆ మూవీ కంటే కాస్త ముందంజలోనే కనిపించిన మిస్టర్ బచ్చన్ ఇప్పుడిలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు చేయడం ఆశ్చర్యం కలిగించేదే.
ఈ మిస్టర్ బచ్చన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ యాక్షన్ డ్రామా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు ముఖ్యమైన పాత్ర పోషించాడు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.