OTT Movies on Lord Ram: శ్రీరామ నవమి రోజు ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే
OTT Movies on Lord Ram: శ్రీరామ నవమి రోజు ఆ రాముడి భక్తిపారవశ్యంలో మునిగి తేలడానికి ఓటీటీల్లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి? ఏ ఓటీటీల్లో చూడాలో ఇక్కడ చూడండి.
OTT Movies on Lord Ram: శ్రీరామ నవమి వేడుకలు బుధవారం (ఏప్రిల్ 17) ఘనంగా జరుగుతున్నాయి. ఈ శుభ సందర్భంలో ఓటీటీల్లో రాముడిపై వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలండి. తెలుగుతోపాటు వివిధ భాషల్లో వచ్చిన ఈ సినిమాలు ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.
ఓటీటీల్లోని రాముడి సినిమాలు
శ్రీరామ రాజ్యం - ప్రైమ్ వీడియో
బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన ఈ శ్రీరామ రాజ్యం సినిమాను బాపు డైరెక్ట్ చేశాడు. రామాయణంలోని ఉత్తర కాండ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సీతగా నయనతార నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. జీ5 ఓటీటీలో కూడా చూడొచ్చు.
లవ కుశ - ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్
60 ఏళ్ల కిందట వచ్చిన లవ కుశ మూవీ ఇప్పటికీ తెలుగు వారికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. శ్రీరామ నవమి కంటే ఆ పాత మధురాన్ని చూడటానికి మించిన సందర్భం మరొకటి ఉండదు. ఈ సినిమా ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో ఉంది.
శ్రీరామదాసు - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
భద్రాచలంలో రాములోరి గుడి కట్టిన ఆ శ్రీరామచంద్రుడి భక్తుడు రామదాసు జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ శ్రీరామదాసు. ఇందులో నాగార్జున రామదాసు పాత్రలో నటించాడు. 2006లో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.
సంపూర్ణ రామాయణం - యూట్యూబ్, ఈటీవీ విన్
బాపు తెరకెక్కించిన మరో అద్భుత దృశ్యకావ్యం సంపూర్ణ రామాయణం. ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించిన ఈ సినిమా ఓ సంచలనం. ఈ సంపూర్ణ రామాయణం మూవీని యూట్యూబ్ తోపాటు ఈటీవీ విన్ ఓటీటీల్లో చూడొచ్చు. నిజానికి ఇదే పేరుతో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలూ యూట్యూబ్ లోనే అందుబాటులో ఉన్నాయి.
బాల రామాయణం - యూట్యూబ్
జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించిన ఈ సినిమా పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూవీ. గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. రామాయణాన్ని అందరూ చైల్డ్ ఆర్టిస్టులతో తెరకెక్కించిన విధానం చాలా బాగుంటుంది. ఈ సినిమాను యూట్యూబ్ లో చూడొచ్చు.
ఆదిపురుష్ - ప్రైమ్ వీడియో
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ గతేడాది రిలీజైంది. అయితే ఈ కాలం యువతకు రామాయణాన్ని ఓ కొత్త విధానంలో చూపించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఉంది.
ఇవే కాకుండా సీతారామ కల్యాణం, భూకైలాస్, శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం, మణిరత్నం డైరెక్ట్ చేసిన రావణ్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మూవీస్ ని యూట్యూబ్ లో చూసే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. శ్రీరామ నవమి రోజు ఈ సినిమాలను చూసి రామ నామ జపంతో తరించండి.